పురట్చి తలైవి ఓకే
సాక్షి, చెన్నై : ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫొటోలను మాత్రమే వాడాలని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసింది. రాష్ట్రంలో అయితే, వ్యక్తిగత ప్రకటనల్లో , ఆయా పార్టీల నాయకుల ఫొటోలు ఉన్నా, ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రం కన్పించడం లేదు. కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం సాగుతూ వస్తున్నాయి. ఆ దిశగా ఇటీవల వెలువడ్డ ఓ ప్రకటన హైకోర్టుకు చేరింది.
పురట్చి తలైవి : అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలితను ముద్దుగా కొన్ని పేర్లతో ఆ పార్టీ వర్గాలు పిలవడం జరుగుతున్నది. ఇందులో ప్రధానంగా పురట్చి తలైవి(విప్లవ వనిత), అమ్మ అన్న ఈ రెండు పేర్లు ప్రతి నాయకుడు, కార్యకరక్త నోట విన్పిస్తూనే ఉంటుంది. ఈ పేర్లను ప్రభుత్వ ప్రకటనల్లో వెలువరించడంపై చెన్నైకు చెందిన న్యాయవాది రత్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ప్రకటనల వ్యవహారంలో ఇచ్చిన ఆదేశాల్ని తన పిటిషన్‌లో వివరించారు. సీఎం అన్న పదం ఉండాల్సిన చోట, అమ్మ, పురట్చి తలైవి అన్న పేర్లను ఉపయోగించడం ఎంత వరకు సమంజసమని, ఆ పేర్లను ఇక మీదట వాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి శివజ్ఞానం నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ కొన్ని వ్యాఖ్యల్ని చేసింది. కొందరికి ముద్దు పేర్లు ఉంటాయని, అవి వారి వ్యక్తిగతంగా పేర్కొన్నారు. వ్యక్తిగత పేర్ల వ్యవహారంలో ఎలా జోక్యంచేసుకోగలమని పిటిషనర్ రత్నంను ప్రశ్నించారు. కామేడ్ర్ అన్న పదానికి సిద్ధాంత పరంగా వాడుతున్నారన్నారు. అయితే, దీనిని వ్యక్తిగతంగా తీసుకోలేమని, తప్పుగా భావించలేమని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో ముద్దు పేర్లను తొలగించాలని తాము ఎలా ఆదేశించగలమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనలో సీఎం ఫోటో ఉన్నదా..? అన్న అంశాన్ని స్పష్టం చేయాలని, ఆధారాలు చూపించాలని, అలాంటప్పుడు ఈ పిటిషన్‌ను విచారించ లేమంటూ తోసిపుచ్చారు.