అమ్మ వేలిముద్ర వ్యవహారంలో మేం తలదూర్చం
అమ్మ వేలిముద్ర వ్యవహారంలో మేం తలదూర్చం
Published Tue, Nov 8 2016 9:49 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
తమిళనాడు సీఎం జయలలిత ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అన్నాడీఎంకే అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకం బదులు వేలిముద్ర వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము తలదూర్చమంటూ, ఎన్నికల సంఘమే పత్రాల్లో ప్రామాణికతను ధృవీకరిస్తుందని ఆ పిల్ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్నికల గుర్తులు ఇప్పటికే అలాట్ చేసేశారు, ఈ సమయంలో తాము తలదూర్చడం కరెక్ట్ కాదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలైనా తలెత్తి, అవి సవాల్ చేయదగ్గవి అయితే అది ఎలక్షన్ పిటిషన్ కిందకు వస్తుందని కోర్టు తీర్పు చెప్పింది.
దాదాపు నెలరోజులకు పైగా ఆస్పత్రిలో అస్వస్థతో బాధపడుతున్న అమ్మ జయలలిత, ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అన్నాడీఎంకే ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకం బదులు వేలిముద్రవేశారు. అంతే వివాదం అక్కడ చెలరేగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని వార్తలొస్తుంటే, జయలలిత వేలిముద్ర వేయడేమేమిటంటూ.. కనీసం అమ్మ సంతకం చేసే స్థితిలో కూడా లేరా అంటూ వాదనలు వినిపించాయి. ఆరోగ్యంగా ఉంటే సంతకం చేసేవారు కదా అంటూ పలువురు వాపోయారు. అసలు ఈ వేలిముద్రలు జయలలితవేనా ? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ వివాదం మద్రాసు హైకోర్టు దాకా వెళ్లింది. నామినేషన్ పత్రాలపై అమ్మ వేలిముద్రను సవాలు చేస్తూ కోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సామాజిక కార్యకర్త కే రామస్వామి దాఖలు చేశారు.
అరవకురిచ్చి, తంజావూర్, తిరుప్పరాంగుండ్రం అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న అన్నాడీఎంకే ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తులో సంతకం బదులు అమ్మ ఎడమ చేతి వేలిముద్ర వేశారని, సంతకం బదులు వేలిముద్ర వేయడం ఎన్నికల సంఘ ప్రక్రియ నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది న్యాయవిరుద్ధమని తీర్పు చెప్పాలని ఆయన కోరారు. వేలిముద్రను అంగీకరించడానికి ఎన్నికల కమిషన్ చాలా ఆతృతతో వ్యవహరించిందని దుయ్యబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరుఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ కోర్టు ముందు హాజరై, కోర్టుకు తమ వాదనలు వినిపించారు. చీఫ్ ఎలక్షన్ కార్యాలయం ముందుగానే ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలిపింది. ప్రభుత్వ వైద్యుని సమక్షంలోనే అమ్మ వేలిముద్ర వేశారని, వేసిన వేలిముద్ర ఉప ఎన్నికల్లో చెల్లుబాటు అవుతుందని సీఈసీ కూడా స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం వేలిముద్రతో కూడిన బీఫాంలపై ఆమోద ముద్ర వేశారు.
Advertisement
Advertisement