సిగ్నల్ పడగానే ట్రిగ్గర్ నొక్కారు !
బెంగళూరు:
పట్టపగలు యలహంకలోని కోగిల్ సిగ్నల్ వద్ద శుక్రవారం సినీఫక్కీలో ఇద్దరు దుండగులు కారులోని వ్యక్తులపై కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... బెంగళూరు నగర జిల్లా, దాసనపుర హోబళి ఏపీఎంసీ అధ్యక్షుడు కడబగెరె శ్రీనివాస్ శుక్రవారం తన హోండా సిటీ కారులో బసవేశ్వరనగర్ నుంచి దేవనహళ్లి వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో వాహనం మధ్యాహ్నం 12 గంటలకు కోగిల్‌క్రాస్‌కు చేరుకోగానే సిగ్నల్ పడింది. దీంతో కారును ఆపారు.
కారును నంబర్‌ప్లేట్ లేని బ్లాక్‌పల్సర్‌లో కొంత దూరం నుంచి వెంబడిస్తున్న ఇద్దరు దుండగులు ఒక్కసారిగా వాహనం ఎడమ వైపునకు చేరుకున్నారు. వెంటనే తుపాకీతో డ్రైవర్ పక్కసీట్లో కుర్చొన్న కడబగెరె శ్రీనివాస్‌పై కాల్పులు జరిపారు. అంతేకాకుండా సాక్షులు ఉండకూడదన్న ఉద్దేశంతో డ్రైవర్ మెయిలీతో పాటు కారు వెనుక సీట్లో కుర్చొన్న గన్‌మెన్ శ్రీధర్‌పై కూడా కాల్పులు జరిపారు. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 8 రౌండ్ల కాల్పుల్లో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కన్ను, ఎడమ చేయితో పాటు పొట్ట భాగంలో మొత్తం మూడు తూటాలు దూసుకుపోయాయి. ఇక మొయిలీ, శ్రీధర్‌లు స్పల్పంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు ద్విచక్రవాహనంపై దేవనహళ్లి వైపు వెళ్లిపోయారు. ఘటన నుంచి తేరుకున్న వెంటనే డ్రైవర్ మెయిలీ అదే కారులో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌తోపాటు గన్‌మేన్ శ్రీధర్‌కు హెబ్బాళలోని కొలంబియా ఏషియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ శరీరం నుంచి మూడు బులెట్‌లను బయటికి తీసి ఐసీయూలో ఉంచారు. ఇక ఘటనలో గాయపడిన మిగిలిన ఇద్దరు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనకు సంబంధించి మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించినట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపారు.
గతంలో కేసులు...
కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కడబగెరె శ్రీనివాస్ ఆయన తమ్ముడు పాయిజన్ రామపై నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో రౌడీషీట్‌తో పాటు కొన్ని కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా రెండు నెలల క్రితం పాయిజన్ రామ ఓ వ్యక్తిని హత్య చేసిన కేసుకు సంబంధించి సాక్షులైన జైరామ్‌శెట్టి, ప్రేమ్‌శెట్టిలపై హత్యాయత్నం చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. అంతే కాకుండా గతంలో బీజేపీలో పని చేసిన కడబగెరె శ్రీనివాస్ కొద్ది కాలం క్రితం కాంగ్రెస్‌లోకి చేరి అనంతరం జరిగిన ఏపీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇది రాజకీయ వైషమ్యం లేదా వ్యక్తిగత కారణాలతో జరిగిన ప్రతీకార దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.