సోమనాథ్ రాజీనామా చెయ్యాలి
Published Wed, Jan 15 2014 11:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: న్యాయ శాఖ మంత్రి సోమనాథ్ భారతి రాజీనామా చెయ్యాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) డిమాండ్ చేసింది. గతేడాది భారతి వాదించిన ఓ కేసులో సాక్ష్యాన్ని లేకుండా చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపించింది. బీజేపీ నాయకుడు అర్తి మెహ్రా ఆధ్వర్యంలో అనేక మంది బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ సెక్రటేరియట్ ముందు బుధవారం ఆందోళనకు దిగారు. భారతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సాక్ష్యాన్ని లేకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. కోర్టే ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అలాంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రిలో కొనసాగాల్సిన అవసరం లేద’ని మాజీ మేయర్ మెహ్రా అన్నారు. ఇది చాలా పెద్ద విషయమని, భారతిని తప్పించాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి కోరతామని తెలిపారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్ కుమార్ అనే వ్యక్తి తరఫున గతేడాది ఆగస్టులో వాదించిన భారతిని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ మందలించిందని మీడియాలో మంగళవారం కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.కేజ్రీవాల్‌పై విమర్శలు న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతిని సమర్థించిన సీఎం కేజ్రీవాల్‌పై ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ విమర్శలు దాడి పెంచారు. అవినీతి కేసులో సోమనాథ్ భారతి సాక్ష్యాన్ని లేకుండా చేశారని సంకేతాలు ఇచ్చిన ప్రత్యేక సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాననడంపై మండిపడ్డారు. భారతిని కేజ్రీవాల్ వెనకేసుకరావడం షాక్‌కు గురి చేసింది. వెంటనే అయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలని గోయల్ డిమాండ్ చేశారు.
భారతిని వెనుకేసుకొచ్చి కేజ్రీవాల్ తమ పార్టీ నాయకులు చట్టాన్ని కన్నా ఎక్కువ అనే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు కనబడుతోందని మండిపడ్డారు. ఒకవేళ కోర్టు తీర్పుతో అంగీకరించకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నారు. అయితే భారతిని వెనకేసుక రావడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆరోపణలు వచ్చిన మంత్రిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్, ఆప్‌ల మధ్య అంతర్గత మైత్రి ఉందని ఎన్నోసార్లు చెప్పామని, అది ఎన్నికల తర్వాత రుజువైందన్నారు. ఇప్పటికీ అవినీతి చేసిన కాంగ్రెస్ నాయకులెవ్వరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే వారి లోపాయికారి ఒప్పందాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. ఆప్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.
Advertisement
Advertisement