
అవినీతికే బీజేపీ పట్టం
- రాష్ర్టంలో జైలుకెళ్లిన తొలి మాజీ సీఎం యడ్యూరప్పే
- ఆయనకు బీజేపీలో మళ్లీ పగ్గాలు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జోరుగా అవినీతి
- యూపీఏ అధికారంలోకి వస్తే ఇండస్ట్రియల్ కారిడార్
- మా పార్టీలో మోడీ లాంటి వారు చాలా మంది ఉన్నారు
- బళ్లారి, మంగళూరు బహిరంగ సభల్లో రాహుల్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/సాక్షి, బళ్లారి/బళ్లారి టౌన్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కమలనాథులు అవినీతికే పట్టం కడుతున్నారని ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన బళ్లారి బహిరంగ సభలో మాట్లాడుతూ.. నిత్యం కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడే వారికి.. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లోని అవినీతి కన్పించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ హయాంలో ముఖ్యమంత్రిగా పని చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి అవినీతి కుంభకోణాల వల్ల జైలుకు వెళ్లడం రాష్ర్ట రాజకీయ చరిత్రలోనే బీజేపీ నేతలు సాధించిన ఘనతని ఎద్దేవా చేశారు. జైలు నుంచి వచ్చిన ఆయన్ను మళ్లీ పార్టీలో చేర్చుకోవడం చూస్తే వారి లక్ష్యం అవినీతికే పట్టం కట్టడమేనన్నది స్పష్టమవుతోందన్నారు. బళ్లారిలో జరిగిన అవినీతి కుంభకోణాల ప్రతిపైసా తిరిగి బళ్లారి ప్రజలకు చేరేలా కృషి చేస్తామన్నారు. యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తే బొంబాయి-చెన్నై, కోల్‌కతా-బెంగళూరు మధ్య ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
కర్ణాటకతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తన అవ్వ ఇందిర చిక్కమగళూరు నుంచి ఎంపీగా, తన తల్లి సోనియాగాంధీ బళ్లారి నుంచి లోక్‌సభ మెంబర్‌గా గెలుపొందారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ అదుపు తప్పిందన్నారు. బళ్లారి జిల్లాలో హిట్లర్ పాలన ఉండేదన్నారు. శ్రీరాములు గత ఎన్నికలలో బీఎస్‌ఆర్ సీపీ స్థాపించి.. నేడు బీజేపీలోకి చేరడం సబబు కాదన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాట్లాడుతూ.. తాను ప్రధాని మంత్రి అవుతున్నట్లు భ్రమల్లో మోడి తేలుతున్నాడని, కానీ ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరని, అంతటి అర్హత ఆయనకు లేదని విమర్శించారు.
అధికారం అందరికీ... మంగళూరులో రాహుల్
దేశాధికారం అందరి చేతుల్లో ఉండాలని తమ పార్టీ కోరుకుంటుంటే, బీజేపీ మాత్రం ఒకే వ్యక్తి చేతిలో ఉండాలని అభిలాషిస్తోందని రాహుల్ విమర్శించారు. మోడిని వారు దేశ రక్షకుడిగా చెప్పుకుంటున్నారని, అలాంటి రక్షకులు తమ పార్టీలో లెక్కలేనంత మంది ఉన్నారని అన్నారు. మంగళూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఆంతరంగిక ఎన్నిక (ప్రైమరీస్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తూ, గతంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసేవారని తెలిపారు.
అయితే తొలిసారిగా తాము పార్టీ స్థానిక కమిటీలకు ఈ బాధ్యతను అప్పగించామని చెప్పారు. ఆ విధంగానే ఇక్కడ జనార్దన పూజారి అభ్యర్థి అయ్యారు కనుక, ఆయనకు మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ఐటీలో బెంగళూరు పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎలా మార్మోగి పోతున్నదో, మంగళూరుకూ అదే వైభవాన్ని కల్పిస్తామని తెలిపారు. నగర ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.