'మంత్రులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి'
'మంత్రులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి'
Published Tue, Apr 11 2017 2:59 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కోర్టుల స్టేలను తప్పు పడుతున్నారని, ఇది జ్యుడీషియరీలో జోక్యం చేసుకోవడమే అవుతుందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేల విషయంలో ప్రధాన న్యాయమూర్తిని కలవమని కార్యదర్శులకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది కోర్టుల అధికారాన్ని ప్రశ్నించడమే అవుతుందని, మంత్రులు రాజ్యాంగానికి లోబడి పని చేయాలని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రుల వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు.
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన దశ దిశ ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కొత్త జిల్లాలతో అభివృద్ది అన్నారు కానీ ఇప్పటికీ ఆ జిల్లాల్లో పూర్తి వసతులు ఏర్పడలేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులను శాసిస్తున్నారని, పోస్టింగ్‌ల కోసం లంచాలు తీసుకుంటున్నారని, గ్రామసభలకు అర్దం లేకుండా పోయిందని, టీఆర్ఎస్ నేతలు చెప్తేనే పని అయ్యేలా పరిస్థితులు మారిపోయాయని, ఉపాధి హామీ నిధులను దారి మళ్ళిస్తున్నారని, ఐదారు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇవ్వలేదని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.
Advertisement