కర్ణాటక నుంచి రాజ్య సభకు వెంకయ్యను మరోసారి ప్రతిపాదించడంపై కరవే ఆగ్రహవేశాలు
రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన వెంకయ్య దిష్టిబొమ్మలు దహనం
బెంగళూరు: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఈ సారి సైతం కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలన్న బీజేపీ నిర్ణయానికి కన్నడిగుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ‘వెంకయ్య....సాకయ్యా’(వెంకయ్యా....చాలయ్యా) అంటూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ జరుగుతోంది. వెంకయ్యనాయుడు ఇప్పటికే కర్ణాటక నుండి మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారని, అయినప్పటికీ ఆయన కర్ణాటకకు చేసిందేమీ లేదన్నది వీరి వాదన. అందువల్ల ఈ సారి కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేసేందుకు కన్నడిగునికే అవకాశం కల్పించాలంటూ సామాజిక మాధ్యమాల్లో డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడిక ఏకంగా కర్ణాటక రక్షణా వేదిక(కరవే) ఆధ్వర్యంలో సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై నిరసనలు వెల్లువయ్యాయి. వెంకయ్యనాయుడు స్థానికుడు కాదని, అందువల్ల బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకొని స్థానికుడికి రాజ్యసభ టికెట్ ఇవ్వాలని కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. బెంగళూరుతో పాటు చిక్కబళ్లాపుర తదితర ప్రాంతాల్లో కరవే కార్యకర్తలు తమ నినాదాలతో హోరెత్తించారు. కరవే కార్యకర్తలు బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయం జగన్నాధ భవన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.