బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితాపై రాజ్‌నాథ్‌తో చర్చిస్తాం | bjp members no yet decided :yeddyurappa | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితాపై రాజ్‌నాథ్‌తో చర్చిస్తాం

Published Wed, Feb 5 2014 2:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM

bjp members no yet decided :yeddyurappa

 దావణగెరె, న్యూస్‌లైన్ :
 ఢిల్లీలో గురువారం జరుగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చిస్తామని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో జరుగనున్న కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటున్నారని, అభ్యర్థుల ఎంపికపై సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. ఆ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్‌కు పూర్తి సమాచారం అందించి వారితో అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 70 శాతం మంది ప్రజల్లో నరేంద్ర మోడీయే తదుపరి ప్రధాని కావాలన్న అభిప్రాయం ఉందన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిపించాల్సి ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తనపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను కూడా పోటీ చేయాలని యోచిస్తున్నానన్నారు. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమితి అధ్యక్ష స్థానానికి తాను రేసులో లేనన్నారు. కేజేపీ ఇక ముగిసిన అధ్యాయమన్నారు. మొదటి నుంచి తాను బీజేపీలో సంతృప్తిగా ఉన్నానన్నారు. ఇప్పుడిక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు.


 బండె మృతి మిస్టరీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి
 ఇటీవల గుల్బర్గాలో  పోలీసు అధికారి మల్లికార్జున బండె మృతి మిస్టరీగా మిగిలిందని, దీనిని చేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని యడ్యూరప్ప ఒత్తిడి చేశారు. బండెపైకి దూసుకొచ్చిన బుల్లెట్ ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. బండె భార్య కూడా తన భర్త మృతి వెనుక కుట్ర దాగి ఉందని, సీబీఐ దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని డిమాండ్ చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు కూడా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నా ఈ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. బండె భార్య సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని ఒక వైపు ఒత్తిడి చేస్తుండగా, గ్యాంగ్‌స్టర్ మున్నా భార్య తన భర్త దగ్గర ఎలాంటి పిస్తోలు లేదని, ఇది నకిలీ ఎన్‌కౌంటర్ అని మరో వైపు ఆరోపిస్తోందని గుర్తు చేశారు.
 పోలీసులే పోలీసులను హతమార్చే సందర్భం వస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తేలికగా తీసుకోరాదన్నారు. ఈ మిస్టరీలో నిజాలు నిగ్గు తేలాలంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు ఎస్‌ఏ రవీంద్రనాథ్, ఎంపీ రేణుకాచార్య, విపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ ఏహెచ్ శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యేలు మాడాళు విరుపాక్షప్ప, బీపీ హరీష్, బసవరాజ్ నాయక్, ఏ.చంద్రప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement