సోమ్‌నాథ్‌ను తప్పించాల్సిందే!
Published Mon, Jan 27 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
సాక్షి, న్యూఢిల్లీ: ధర్నాల రాజకీయాలకు సోమవారం రాజధాని నగరం వేదికైంది. సంచలనాల ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌ను ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత వినోద్‌కుమార్ బిన్నీ ఓ పక్క ఇబ్బంది పెడుతుండగా మరోవైపు నుంచి ప్రతిపక్ష బీజేపీ అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని మంత్రిపదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దాదాపు రెండు గంటలపాటు సీఎం కార్యాలయాన్ని నినాదాలతో హోరెత్తించారు. ఖిడ్కీ ఎక్స్‌టెన్షన్‌లో అర్ధరాత్రి సోదాల వ్యవహారంలో సోమ్‌నాథ్ భారతి ప్రవర్తించిన తీరును మొదటినుంచి తప్పుపడుతోన్న బీజేపీ ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూడిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. భారతిని తొలగించాలనే డిమాండ్‌తో హర్షవర్ధన్ నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు, అకాలీదళ్‌కు చెందిన ఎమ్మెల్యే ఈ ధర్నాలో పాల్గొన్నారు. సోమ్‌నాథ్‌కు, కేజ్రీవాల్‌కు, ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా రాసిన నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శించారు.
ముందుగానే హెచ్చరించాం...
మంత్రి సోమ్‌నాథ్ భారతి మహిళలతో అమర్యాదగా వ్యవహరించారని, చట్టాన్ని అతిక్రమించారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హర్షవర్ధన్ ఆరోపించారు. ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించేందుకు 26వ తేదీ వరకు గడువిచ్చామని, లేనట్లయితే 27న ధర్నాకు దిగుతామని ముందుగానే హెచ్చరించామన్నారు. ఈ విషయమై కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ కూడా రాశామన్నారు.
కేజ్రీవాల్ మెతకవైఖరి...
బీజేపీ ధర్నాపై కేజ్రీవాల్ స్పందన కూడా అంతే కఠినంగా ఉంటుందని భావించినా పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. హర్షవర్ధన్ తదితరులతో వాగ్వాదానికి దిగుతారని ఊహించినప్పటికీ కేజ్రీవాల్ మెతకవైఖరి అవలంబించారు. తన కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన బీజేపీ నేతలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా వచ్చి కలుసుకున్నారు. వారి భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. వారి మధ్యే కూర్చుండి మాట్లాడారు. అనంతరం బీజేపీ నేతలు తాము రాసిన బహిరంగ లేఖను కేజ్రీవాల్‌కు అందించారు. సోమ్‌నాథ్ భారతిని తప్పించాలని డిమాండ్ చేశారు.
విలువలు తెలిస్తే రాజీనామా కోరాలి..
ముఖ్యమంత్రిని కలిసిన తరువాత హర్షవర్ధన్ విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్‌కు విలువల గురించి తెలిసినట్లయితే భారతి నుంచి రాజీనామా కోరాలన్నారు. దేశవాసుల ఎదుట రాజ్యాంగాన్ని, కార్యనిర్వాహకవర్గాన్ని, న్యాయవ్యవస్థను, మీడియాను అవమానించిన సోమ్‌నాథ్ భారతిని పదవిలో కొనసాగించడాన్ని సహించబోమనే విషయాన్ని కేజ్రీవాల్‌తో చెప్పామన్నారు. సోమ్‌నాథ్ తొలగింపును డిమాండ్ చేస్తూ తాము కేవలం సూచనప్రాయంగానే ఈ ధర్నా చేపట్టామని, రానున్న రోజుల్లో తమ ఆందోళనను మరింత తీవ్రం చేయడంతోపాటు అంశాన్ని రాష్ట్రపతి వద్దకు తీసుకువెళ్తామని హెచ్చరించారు.
Advertisement
Advertisement