సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయా? అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. శనివారం పార్టీ కార్యాలయంలో కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీవాసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం, కార్యకర్తల కృషిని ప్రశంసించడం... ఇవన్నీ ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాన్ని ఇచ్చాయని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ నేతలు, శ్రేణులు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేడి చల్లారకముందే అసెంబ్లీ ఎన్నికలు జరిపించడం మంచిదని అంటున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికవడంతో అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 29కి పడిపోయింది.
ఈ సంఖ్యతో ప్రభుత్వం ఏర్పాటుచేయడం కోసం ప్రత్యర్థి పార్టీలను చీల్చవలసి ఉంటుందని, దాని కన్నా సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటుచేయడం మేలని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే నిన్నటివరకు అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని కోరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లాలంటే జంకుతోంది. ఢిల్లీలో ఒక్కసీటు కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలలో మనోబలం సన్నగిల్లింది. అయితే అన్ని స్థానాలలో తాము రెండో స్థానంలో నిలవడం ,అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటు శాతం కూడా పెరగడం ఆ పార్టీ నేతలకు ఆశలు రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌కు 30 శాతం ఓట్లు లభించగా, లోక్‌సభ ఎన్నికలలో అది 33 శాతానికి పెరిగిందని వారంటున్నారు. తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉందని, పేద, దళిత ఓటర్లు తమను వదలలేదని, కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓటేశారని వారు భావిస్తున్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు!
Published Sat, May 17 2014 10:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement