
దాడి చేస్తాం
సాక్షి, చెన్నై: సీఎం పన్నీరు సెల్వం, మంత్రులపై బాంబు దాడులు చేస్తామని ఓ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు లేఖ రాశాడు. అరియలూరు రైల్వే స్టేషన్‌కు ఈ లేఖ రావడంతో దీనిని పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ వేగవంతం చేశారు. అరియలూరు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ లేఖను అక్కడి సిబ్బంది చదివారు. అందులో అరియలూరులోని ప్రధాన వంతెనను పేల్చేస్తామని, మలై కోట్టై ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించి, బోల్తా కొట్టిస్తామని పేర్కొనడంతో అక్కడి సిబ్బంది ఆందోళనలో పడ్డారు. అదే లేఖలో మరో వైపుగా మంత్రుల్ని వదలి పెట్టమని, సీఎం పన్నీరు సెల్వం సచివాలయూనికి వెళ్లే సమయంలో రాకెట్ లాంఛర్‌తో దాడి చేయబోతున్నామని హెచ్చరించడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను అందుకున్న రైల్వే పోలీసులు అరియలూరు, తిరుచ్చి ఎస్పీలకు సమాచారం అందించారు.
ఈ నెల 13, 14 తేదీల్లో తాము అనుకున్నట్టుగా, ముందుగా వేసిన పథకం మేరకు దాడులు జరిగి తీరుతాయని మోహన్ మురళి శంకర్ పేరును లేఖలో రాసి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ లేఖ తిరుచ్చిలోని రామలింగ పురం నుంచి రావడంతో అక్కడ విచారణను వేగవంతం చేశారు. గత నెల ఇదే చిరునామాతో తిరుచ్చి శ్రీరంగం స్టేషన్‌కు రావడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ లేఖలను పంపిస్తున్న వ్యక్తి ఒకరేగా భావించి అతడి భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాలు పరుగులు తీస్తున్నాయి. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా వంతెన వద్ద, మలై కోట్టై రైలు అరియలూరు మీదుగా వెళ్లే ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన మంత్రులకు భద్రతను పెంచారు.