
తుగ్లక్ పాలనకు తెరతీస్తే ఊరుకోం: ఎమ్మెల్యే బోండా
విజయవాడ: బంగారంపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడంపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్రం అత్యుత్సాహానికి పోయి మహిళల బంగారం జోలికి వస్తే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తాత, ముత్తాతల కాలం నుంచి లెక్కలు అడిగి తుగ్లక్ పాలనకు తెరతీస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. బంగారం, నగల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులపై మహిళాలోకం మండిపడుతోంది.
వివాహితకు 500 గ్రాములు, పెళ్లికాని యువతికి 250 గ్రాములు.. పురుషుడికి 100 గ్రాముల బంగారం వరకే అనుమతిస్తామని కేంద్రం గురువారం ప్రకటించింది. పరిమితికి మించి బంగారం ఉంటే లెక్కలు చూపాల్సిందేనని ఆదేశించింది. వారసత్వ బంగారం, వ్యవసాయ ఆదాయంతో కొన్న బంగారం ఎంతైనా ఉండొచ్చని పేర్కొంది. లెక్కచెప్పిన బంగారానికి పరిమితి లేదని స్పష్టం చేసింది.