తనకు ఇంకా పెళ్ళి వయసు రాలేదని, మరో ఏడాది ఆగాలని 17 సంవత్సరాల బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పినా వారు వినిపించుకోకుండా పెళ్ళి చేస్తుండటంతో చివరకు తిరగబడింది.
17 ఏళ్లకే పెళ్లికి ముహూర్తం, పోరాడి ఆపించింది
Published Wed, Apr 12 2017 8:58 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
మైసూరు: తనకు ఇంకా పెళ్ళి వయసు రాలేదని, మరో ఏడాది ఆగాలని 17 సంవత్సరాల బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పినా వారు వినిపించుకోకుండా పెళ్ళి చేస్తుండటంతో చివరకు తిరగబడింది. బంధువుల సహకారంతో బాలిక మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారాన్ని ఇచ్చి పెళ్ళిని ఆపేయించింది.
ఈ సంఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని చిక్కబీచనహళ్ళి గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దంపతులు అదే గ్రామానికి చెందిన రమేష్ అనే యువకునితో తమ కుమార్తె(17) వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదని, మరో సంవత్సరం ఆగాలని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కానీ అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
పెళ్లి చేసుకోవాల్సిందేనని మొండికేయడంతో బాలిక బుర్రకు పదును పెట్టింది. బంధువుల సహకారంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫోన్ నెంబర్ తీసుకుని తనకు జరుగుతున్న అన్యాయన్ని తెలిపింది. దాంతో రంగంలోకి దిగిన అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్ళిని నిలిపేయించారు. తల్లిదండ్రులపై బిళికెరె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement