సంజాయిషీ కోరిన ఆప్
సాక్షి, న్యూఢిల్లీ : మంగోల్‌పురి ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాఖీబిర్లా పుట్టినరోజు వేడుకల్లో బుధవారం రాత్రి కిరిడి ఎమ్మెల్యే వర్గానికి, కొందరు వ్యక్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వివాదంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు ఆశుతోష్, సంజయ్‌సింగ్ గురువారం మధ్యాహ్నం రాఖీ బిర్లాతో పాటు కిరాడీ శాసనసభ సభ్యుడు రితురాజ్‌లతో సమావేశమయ్యారు. పుట్టినరోజు వేడుక సందర్భంగా తలెత్తిన వివాదం గురించి ఇద్దరు ఎమ్మెల్యేలను సంజాయిషీ కోరినట్లు తెలిసింది. వివరాలు.. మంగోల్‌పురి ఎమ్మెల్యే రాఖీ బిర్లా జన్మదినం సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో గొడవ జరిగింది.
శాసనసభ్యురాలి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆడంబరంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు పలువురు ఆప్ ఎమ్మెల్యేలతో పాటు కిరాడీ నియోజకవర్గం ఎమ్మెల్యే రితురాజ్ కూడా హాజరయ్యారు. ఆయన పండాల్‌కు చేరుకోగానే గొడవ ప్రారంభమైంది. రితురాజ్ వెనుకనే ఆయన నియోజకవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా పండాల్‌కు చేరుకున్నారు. ఓ హత్యకాండ విషయమై కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న కొందరు వ్యక్తులు రితురాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు.
ఈ పరిణామం రాఖీ బిర్లా సోదరునితో పాటు రితురాజ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలై ఘర్షణకు దారితీసింది. రెండుపక్షాల వారు పరస్పరం చేయి చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఇదిలా ఉండగా మరోవైపు జన్మదినం సందర్భంగా రాఖీ బిర్లాకు స్కార్పియో వాహనాన్ని కూడా కానుకగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. స్కార్పియోని కానుకగా ఇచ్చిన వారెవర న్నది తెలియరాలేదు. ఆప్ నేతల సమావేశం సందర్భంగా ఈ విషయాలపై వారిద్దరి వివరణ కోరినట్లు సమాచారం.
మాజీ మంత్రి రాఖీ బిర్లా జన్మదిన వేడుకల్లో ఘర్షణ
Published Thu, Apr 16 2015 11:07 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement