పట్ట పగలే తమ్ముడి భార్యపై...
చెళ్లకెరె రూరల్ : తాగిన మైకంలో పట్ట పగలే తమ్ముడి భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పట్టణంలోని బీఈఓ కార్యాలయం ప్రాంగణంలో శనివారం సాయంత్రం చోటు చేసకుంది. తాలూకాలోని హెగ్గెరె గ్రామానికి చెందిన శివణ్ణ తన తమ్ముడి భార్య నీలమ్మపై కత్తితో దాడి చేసిన గాయపరిచాడు. వివరాలిలు... హెగ్గెరె గ్రామానికి చెందిన శివణ్ణ, దాదణ్ణ అన్నదమ్ములు. ఇద్దరు గ్రామంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. దాదణ్ణ, నీలమ్మల కూతురు రూపాను ఇదే గ్రామంలో ఉన్న మేనమామ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు.
అయితే రూపా భర్తను వదలి ఇదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో కలిసి వెళ్లింది. అయితే రూపా భర్త తనకు భార్య కావాలని అత్తమామలతో ఘర్షణ పడి నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చే యడానికి గ్రామస్తులతో కలిసి శనివారం వచ్చాడు. అయితే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, పంచాయతీ పెట్టించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాని రూపా తాను భర్తతో కలిసి ఉండటానికి నిరాకరించింది. దాంతో దాదణ్ణ, నీలమ్మలు తమ కూతురును తమ ఇంట్లోనే ఉంచుకుంటామని తెలిపారు.
దీంతో ఆగ్రహించిన దాదణ్ణ అన్న శివణ్ణ తమ్ముడు దాదణ్ణ భార్యను టీ తాగుదాం రమ్మని బయటకు తీసుకు వచ్చాడు. అక్కడ బీఈఓ కార్యాలయ ప్రాంగణంలో నీలమ్మతో గొడవ పడ్డాడు. ఇంటి నుంచి వేరొక వ్యక్తితో వెళ్లిన రూపాను ఎలా ఇంట్లో ఉంచుకుంటారని నిలదీశాడు. గొడవ తారస్థాయికి చేరడంతో నీలమ్మపై తన వద్ద ఉన్న కత్తితో కడుపుపై పలుమార్లు పొడిచాడు. స్థానికులు పరిస్థితి గమనించిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.