
పట్టపగలు మహిళ దారుణ హత్య
- మృతురాలు రైల్వే కానిస్టేబుల్ భార్య
- బంగారు నగలతో ఉడాయింపు
కోలారు : ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహితను దుండగుడు పట్టపగలు దారుణంగా హత్యచేసిన సంఘటన బంగారుపేట పట్టణంలోని అమరావతి కాలనీలో సోమవారం సంచల నం సృష్టించింది. హత్యకు గురైన యువతి రైల్వే కానిస్టేబుల్ భార్య మంజుల (23) కావడం గమనార్హం. వివరాలు... ఉదయం తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు, భర్త అశోక్ విధులకు వెళ్లిపోగా మంజుల ఒంటరిగా ఉంది.
మధ్యాహ్నం 12 ప్రాంతంలో ఇంటిలోకి ప్రవేశించిన దుండగుడు మంజులపై దాడికి దిగి బ్లేడుతో గొంతు కోసి హతమార్చాడు. సంఘటన స్థలంలో సుత్తి కూడా పడి ఉండటంతో అతి దారుణంగా సుత్తితో మోదిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం బీరువాలో ఉన్న నగదుతో ఉడాయించాడు. ఇదే సమయంలో నిందితుడు ఎటువంటి భయం కనిపించకుండా సంఘటన అనంతరం కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చాడు.
అతడి చేతికి రక్తం అంటి ఉండటంతో ఓ వ్యక్తి ప్రశ్నించడంతో వాహనంపై నుంచి కిందపడ్డానని చెప్పి తప్పించుకున్నాడు. కొద్దిసేపు అనంతరం భర్త అశోక్ ఇంటికి వచ్చి చూడగా భార్య రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేజీఎఫ్ ఎస్‌పీ భగవాన్‌దాస్, డీఎస్పీ వివేకానంద, సీఐ వెంకటాచలపతి, ఎస్‌ఐ రవికుమార్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో ఆధారాలు సేకరించారు. వేలిముద్రల నిపుణులు కూడా రంగంలోకి దిగారు. అశోక్ ఫిర్యాదు మేరకు బంగారుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు
హంతుకుడి ఆచూకీ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ భగవాన్ దాస్ తెలిపారు. హంతుకుడి చేతికి కూడా గాయం అయిందని, హత్య చేసిన అనంతరం నిందితుడు కిలోమీటరు పైగా నడుచుకునే వెళ్లాడని పోలీసులు ఆధారాలు సేకరించారని, త్వరలో పట్టుకుంటామని ఎస్‌పీ చెప్పారు.