తెలుగు మహిళ పై అకృత్యం
టీనగర్: కోయంబేడు బస్టాండులో ఒంటరిగా నిలుచునే మహిళలను కిడ్నాప్ చేసి వారితో రాసలీలలు సాగించే ఎంటీసీ బస్‌డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, విరుగంబాక్కం పిళ్లయార్‌కోవిల్ వీధికి చెందినముత్తుకుమార్ (25) కోయంబేడు మార్కెట్‌లో కూలీ. ఇతను ఆంధ్రాకు చెందిన జ్యోతి (23)ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది. శనివారం దంపతులు గొడవ పడ్డారు. దీంతో జ్యోతి బిడ్డతోపాటు ఆంధ్రాకు వెళ్లేందుకు కోయంబేడు బస్టాండు చేరుకుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి జ్యోతితో తాను ఎంటీసీ డ్రైవర్‌నని, ఏమి సమస్యంటూ? ఓదార్చారు. ఆ తర్వాత బిడ్డతోపాటు జ్యోతిని బస్సులో తిరువేర్కాడు తీసుకెళ్లాడు.
అక్కడ ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులో జ్యోతి నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో బిడ్డను తీసుకుని సదరు వ్యక్తి పరారయ్యాడు. హఠాత్తుగా నిద్రలేచిన జ్యోతి బిడ్డ, ఆ వ్యక్తి కనిపించకపోవడంతో దిగ్భ్రాంతి చెందింది. దీనిగురించి ఆమె లాడ్జిలో వాకబు చేసింది. దీంతో సమస్య ఏర్పడుతుందనే భయంతో లాడ్జి ఉద్యోగులు, వెంటనే ఆ మహిళను లాడ్జి నుంచి పంపివేశారు. దీనిగురించి జ్యోతి తిరువేర్కాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి లాడ్జిలో విచారణ జరిపారు.
బిడ్డను అపహరించిన వ్యక్తి నీతిమణి (45), చెన్నై, తిరునిండ్రవూరుకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఆ చిరునామాకు వెళ్లి పోలీసులు విచారణ జరపగా అది నకిలీదిగా తేలింది. ఇలావుండగా గూడువాంజేరి రైల్వే స్టేషన్‌లో 40 ఏళ్ల వయసుగల ఒక వ్యక్తి మద్యం మత్తులో బిడ్డతోపాటు కనిపించాడు. దీంతో అతన్ని అనుమానించిన రైల్వే పోలీసులు అతన్ని,బిడ్డను గూడువాంజేరి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తి మురుగానందం (40), చెన్నై ఎంటీసీ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. సహ డ్రైవర్‌ను చూసేందుకు కోయంబేడుకు రాగా జ్యోతిని మోసగించి తిరువేర్కాడుకు తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో అతన్ని తిరువేర్కాడు పోలీసులకు అప్పగించారు. అతని వద్ద తీవ్ర విచారణ జరపగా కోయంబేడు బస్టాండులో ఒంటరిగా అవస్థలు పడే మహిళలను గుర్తించి లాడ్జికి తీసుకువెళతానని తెలిపాడు.
చెంగల్పట్టులో ఉన్న బంధువుకు బిడ్డను అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డానని తెలిపాడు. జ్యోతిని, ఆమె బిడ్డను చెంగల్పట్టు మహిళా సంరక్షణాలయంలో ఉంచారు. పోలీసులు మురుగానందంను అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు పుళల్ జైలులో నిర్బంధించారు.