బస్సు రాకతో పూలమాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు
సాక్షి, బళ్లారి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు దాటినా ఎర్ర బస్సుకు నోచుకోని ఆ గ్రామానికి ఎట్టకేలకు బస్సు రాకపోకలు ఏర్పాటు చేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యాదగిరి జిల్లాకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బిరాళపుట్ట గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కాలినడకన వెళ్లేవారు. లేదంటే ఆటోలు, సైకిళ్లపై వెళుతూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న నాథులే లేకపోయారు.
ఈనేపథ్యంలో గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరెడ్డికి గ్రామస్తులు సమస్యను వివరించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గురువారం యాదగిరి నుంచి ఆ గ్రామానికి ఆర్‌టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామస్తుల ఆనందం అవధులు దాటింది. బస్సు సౌకర్యం ఏర్పాటు చేయించడంతో పాటు స్వయంగా ఎమ్మెల్యేనే ఆ బస్సులో కూర్చొని మొదటి టికెట్ తీసుకుని అదే బస్సులో గ్రామంలోకి వచ్చి గ్రామస్తులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment