చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు బుధవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీ వరకు సాగనుంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి :ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష కారణంగా శాసన సభ్యత్వాన్ని సీఎం జయ కోల్పోయారు. నిర్దోషిగా బైటపడిన నేపథ్యంలో గత నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆరునెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవడం ఆమెకు అనివార్యమైంది. జయ పోటీకోసం సిద్ధమైన ఆర్కేనగర్‌లో ఈనెల 27వ తేదీన పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. జయపై పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ విముఖత వ్యక్తం చేశాయి. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ సైతం పోటీకి దూరమని మంగళవారం ప్రకటించారు. ఆర్కేనగర్‌లో పోటీకి దిగాల్సిందేనని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై ఒత్తిడిపెరుగుతోంది. రెండు రోజుల్లో కెప్టెన్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మంగళవారం వరకు ట్రాఫిక్ రామస్వామి మినహా మరెవ్వరూ రంగంలో దిగే దాఖలాలు కనిపించలేదు.
అప్పీలుతో హ డావుడి..
జయను నిర్దోషిగా పేర్కొంటూ వెలువడిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో హడావుడికి కారణమైంది. కర్ణాటక ప్రకటన వెలువడగానే అన్నాడీఎంకే నేతలంతా సోమవారం రాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. 9 గంటల సమయంలో మంత్రి ఓ పన్నీర్ సెల్వం ఎన్నికల ప్రచార బాధ్యతలకు నియమితులైన 50 మందితో సమావేశమయ్యారు. కేవలం పది నిమిషాల్లో ముగిసిన ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై కోయంబేడు బస్‌స్టేషన్ నుంచి కర్ణాటక వైపునకు వెళ్లే బస్సులను నిలిపివేశారు. కోయంబేడులో ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు 54 బస్సులకు గాను కేవలం ఏడు బస్సులు మాత్రమే నడిచాయి. బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే తమిళనాడుకు చెందిన బస్సులను సైతం నిలిపివేశారు.
గుండెపోటుతో మృతి
కీరనూర్ పట్టణానికి చెందిన అన్నాడీఎంకే నేత జయకుమార్ (45) సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాత్రి ఇంట్లో కూర్చుని టీవీలో వార్తలు చూస్తుండగా జయకేసులో కర్ణాటక ప్రభుత్వం అప్పీలుకు వెళుతున్నట్లు చెప్పడంతో తీవ్రస్థాయిలో గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నేటి నుంచి నామినేషన్లు
Published Wed, Jun 3 2015 2:27 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement