శిడ్లఘట్ట, న్యూస్‌లైన్ : కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లో కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొందని, ఈ రెండు జిల్లాల్లో నీటి కష్టాలను ఎలా పరిష్కరిస్తారో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రజలకు తెలియచేయాలని కర్ణాటక రాష్ర్ట రైతు సంఘం, హసిరు సేనే రాష్ట్ర అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
సోమవారం శిడ్లఘట్ట పట్టణంలోని తాలూకా కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ‘శాశ్వత నీరావతి పథకం’పై ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో కండువా భుజంపై వేసుకుని పలుమార్లు రైతులతో కలిసి పోరాటాలు చేశారని, నేడు కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల కరువు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి న్యాయం చేస్తారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వందల చెరువులు ఉన్నా, ప్రస్తుతం నీరు లేక ఎండి పోయాయని, భూగర్భ జలాలు ప్రస్తుతం 12 వందల అడుగుల నుంచి 13 వందల అడుగులకు చేరిందని, రాబోయే రోజుల్లో ప్రజలకు నీరు దొరుకుతుందన్న నమ్మకం లేదన్నారు. ఈ ప్రాంతం ప్రజల కోసం డాక్టర్ పరమశివ య్య నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎంను డిమాండ్ చేశారు.
ఎత్తినెహోళె పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు పనులను ఇప్పించి సుమారు రూ. 8 వేల కోట్ల విలువ చేసే పైపులను తెప్పించి ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో కర్ణాటక రాష్ర్ట రైతు సంఘం ఉపాధ్యక్షుడు జడియప్ప దేశాయి, శాశ్వత నీరావరి పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, జిల్లా పంచాయతీ సభ్యుడు నారాయణస్వామి, తాలూకా న్యాయవాదుల సంఘం సభ్యుడు పాపిరెడ్డి, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రామయ్య, రైతు మహిళ సంఘం సభ్యురాలు సులోచనమ్మ పాల్గొన్నారు.
ఆ రెండు జిల్లాలకు నీరు ఎలా అందిస్తారో చెప్పాలి
Published Tue, Oct 1 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement