
మంత్రి వర్గ విస్తరణ ఖాయం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
బెంగళూరు: ఏప్రిల్ చివరి నాటికి మంత్రి వర్గ విస్తరణ చేపట్టి తీరుతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారమిక్కడి విధానసౌధలోని బాంక్వెట్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గేతో కలిసి బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సిద్ధరామయ్య మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఆశావహులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మంత్రి కావాలనే ఆశ ప్రతి ఎమ్మెల్యేకు ఉంటుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇక శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరువు ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించేందుకు పర్యటన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కరువు పరిస్థితుల నిర్వహణకు సంబంధించి పరిశీలన జరిపేందుకు ఇప్పటికే నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు సిద్దరామయ్య వెల్లడించారు.
ఏడాదంతా అంబేద్కర్ జయంతి...
ఇక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాదంతా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆయన జీవిత చరిత్ర తదితర విషయాలన్నింటిని నేటి తరానికి పరిచయం చేసేలా నాటికలు, షార్ట్ ఫిల్మ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నస్వామి మాంబళ్లికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బి.ఆర్.అంబేద్కర్ స్మారక అవార్డును అందజేసి సత్కరించారు.