విస్తరణపైనే ఆశలు
Published Thu, Oct 20 2016 1:07 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
అభివృద్ధి కార్యక్రమాలన్నీరెండు జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలోనే..!
భవిష్యత్ మంత్రివర్గ విస్తరణపై తూర్పు ఎమ్మెల్యేల్లో ఆశలు
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు మంత్రులు లేరు!
ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రులకు ఈ జిల్లాలతో సంబంధం కట్!
సాక్షి, మంచిర్యాల : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో జిల్లా మంత్రి పాత్ర ప్రధానం. జిల్లాకు పెద్దన్న పాత్ర పోషించే మంత్రి లేకపోతే ఇన్‌చార్జి మంత్రి ఆ బాధ్యత తీసుకుంటారు. కానీ.. పునర్విభజనతో కొత్తగా ఏర్పాౖటెన తూర్పు జిల్లా లు మంచిర్యాల, ఆసిఫాబాద్‌లకు ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో జోగు రామన్న (ఆదిలాబాద్), అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్) మంత్రులుగా ప్రాతినిధ్యం వహించేవారు. మాతృ జిల్లాను నాలుగుగా విభజించడంతో రామన్న ఆదిలాబాద్‌కు, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌కు పరిమితమయ్యారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లకు మాత్రం మంత్రులు లేరు. ఈ కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి సైతం ఇన్‌చార్జీలుగా పద్మారావుగౌడ్, జోగు రామన్న వచ్చారు. ఈ పరిస్థితుల్లో మంత్రులు లేని మంచిర్యాల, ఆసిఫాబాద్‌ల భవిష్యత్ రాజకీయాలపై అధికార పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.
ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థకు తిరిగి ప్రాణప్రతిష్ట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో ప్రతి జిల్లాకూ మంత్రి ఉన్నా, ఇన్‌చార్జి మంత్రిగా వేరే జిల్లా మంత్రి ఉండేవారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల(డీడీఆర్‌సీ)తోపాటు ఆయా జిల్లాల్లో జరిగే అన్ని కీలక సమావేశాలను ఇన్‌చార్జి మంత్రులే ముందుండి నడిపించేవారు. అలాగే శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఏసీడీఎఫ్) వెచ్చించే విషయంలో కూడా ఇన్‌చార్జి మంత్రులకు 50 శాతం అధికారం ఉండేది. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాౖటెన తరువాత 10 జిల్లాలే ఉండడం, ప్రతి జిల్లాకూ ఓ మంత్రి తప్పనిసరిగా ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థను తొలగించారు. ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారిలో సీనియర్‌కే ప్రొటోకాల్ ప్రకారం బాధ్యత అప్పగించారు. సీనియర్ మంత్రి ద్వారానే స్వాతంత్య్ర దినోత్సవం రోజు జాతీయ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాలు జరిగేవి. అయితే.. ఇప్పుడు జిల్లాలు 31కి చేరగా, అనేక కొత్త జిల్లాలకు మంత్రులు లేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి విడిపోయిన మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలదీ అదే సీన్. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పరిమితుల దృష్ట్యా ప్రతి జిల్లాకూ మంత్రిని నియమించే పరిస్థితులు లేనందునా ఇన్‌చార్జీల నేతృత్వంలోనే కార్యక్రమాలు సాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కలెక్టర్‌లదే హవా..
మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలతోపాటు ఆదిలాబాద్ జిల్లా పరిధి ఖానాపూర్ సెగ్మెంట్‌లోని జన్నారం మండలం మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఒక్కరే ప్రభుత్వంలో విప్ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి , సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నప్పటికీ ప్రభుత్వంలో బాధ్యతలేమీ లేవు. దీంతో నియోజకవర్గాల్లోని స్థానిక ఎమ్మెల్యేలే తమకు సంబంధించిన కార్యక్రమాలకు కీలకమయ్యారు. ఎంపీ బాల్క సుమన్ ఉన్నా, ఆయనది అతిథి పాత్రే. ఈ పరిస్థితుల్లో రెండు జిల్లాల కలెక్టర్లే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా మారనున్నారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలన్నీ ప్రస్తుతం కలెక్టర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నా యి. మంత్రులు లేనందు వల్ల వారి బాధ్యతలను కూడా ఇక ముందు కలెక్టర్లే చూస్తారని సమాచారం.
మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేల ఆశ
10 నియోజకవర్గాల ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రాతినిథ్యం ఉండేది. వీరు ‘కొత్త’ జిల్లాల మంత్రులుగా మారడంతో తూర్పు జిల్లాల ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశతో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరి జాతకాలు ఎలా మారుతాయో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే తెలుసు.
Advertisement
Advertisement