
‘కారు’ చౌక బేరం!
♦ ఆడి కారు రూ.2 లక్షలే
♦ అదే దారిలో మరిన్ని లగ్జరీ కార్లు
♦ చెన్నైలో జోరుగా విక్రయాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘భలే మంచి చౌక బేరము.. ఇది సమయము.. మించినన్.. దొరకదు’ అన్న చందంగా ప్రస్తుతం చెన్నై ప్రజలు ‘కారు’చౌక బేరం ఆడేస్తున్నారు. లగ్జరీ కార్లను రూ.40 లక్షలు విలువజేసే ఆడి, మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లు కేవలం రూ.2 లక్షలకే అమ్మేందుకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. బ్రాండ్ న్యూ కార్లకూ వీటికీ తేడా ఏమిటంటే.. ఇటీవల చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు ఖరీదైన కార్లు నీట మునిగిపోయాయి. దాదాపు 30 వేల కార్లు రోజుల తరబడి నీటిలో నానిపోయాయి. సుమారు 10 వేల కార్లలో ఇంజిన్లు పాడయ్యాయి. వీటిని వేలం వేయడం మినహా మరో దారిలేదని బీమా కంపెనీలు తీర్మానించుకున్నాయి.
కంపెనీ యాజమాన్యాలు సదరు కార్ల పరిస్థితిని బట్టి వాటికి ధర నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు పెట్టగా ప్రజలు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలోని గోరాట్రక్ పార్కింగ్ మైదానంలో పాడైపోయిన ఖరీదైన కార్లను వరుస పెట్టారు. ప్రస్తుతం ఖరీదైన కార్లుగా పేరొందిన బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, బెంట్లీ, హమ్మర్ తదితర కార్లను కేవలం రూ.2 లక్షలకే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. మరమ్మతు సాధ్యం కాదని మెకానిక్‌లు చెబుతున్నా, తమకు తెలిసిన వారిచేత బాగుచేయించుకుంటామని కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. 2011 మోడల్ ఆడి కారు రూ.3 లక్షలకు అమ్ముడుపోయింది. సీవోపీఏఆర్‌టీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హై ఎండ్ లగ్జరీ కారును షోరూం ధరలో కనీసం 40 శాతం తక్కువకు ఇక్కడ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.