
బెంగళూరులో కొనసాగుతున్న 144 సెక్షన్..
బెంగళూరు : కావేరి జల వివాదంపై అట్టుడుకుతున్న కర్ణాటకలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్త చర్యగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్లతో పాటు అదనంగా 15వేలమంది పోలీసులు, అధికారులు విధుల్లో నిమగ్నమయ్యారు.
బెంగళూరుతో పాటు మండ్యా, మైసూరు నగరాలతో పాటు.. కర్ణాటకలో కావేరి నదిపై గల 4 జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ కింద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అలాగే మండ్యాలో ఈ నెల 17వరకూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు బెంగళూరులో మెట్రో సర్వీసులను నిలిపివేశారు. కాగా ఆందోళనకారులు నిన్న 270 వాహనాలను తగులబెట్టారు. అల్లర్లలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఇక తాజా పరిణామాలపై చర్చించేందుకు కర్ణాటక మంత్రివర్గం మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది.