'ఫినిక్స్' పై సీబీఐ విచారణకు పట్టు
చెన్నై : ఫినిక్స్ మాల్‌లో 11 సినీ స్క్రీన్స్ జాస్ సంస్థ గుప్పెట్లోకి వెళ్లిన వ్యవహారంపై సీబీఐ విచారణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి డిమాండ్ చేశారు. జాస్ సంస్థకు 136 స్క్రీన్స్ దేశ వ్యాప్తంగా ఉన్నట్టుగా సమాచారాలు వస్తున్నాయని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నిగ్చు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ, బంధువు ఇలవరసి గుప్పెట్లోకి వేళచ్చేరి ఫినిక్స్ మాల్‌లోని 11 సినీ స్క్రీన్స్ చేరినట్టుగా మీడియాలో కథనం వెలువడ్డ విషయం తెలిసిందే.
రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ఆ స్క్రీన్స్ కొన్నట్టు, క్లాసిక్ మాల్ నుంచి బలవంతంగా జాస్ సంస్థ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రచారం, ఆరోపణలకు కళ్లెం వేస్తూ గతవారం క్లాసిక్ మాల్ సంస్థ ఓ ప్రకటన చేసింది. తమ సినీ స్క్రీన్స్‌ను జాస్ సంస్థ కొనుగోలు చేయలేదని, కేవలం ఆ సంస్థ లీజుదారుడేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం అనుమానాలకు తావివ్వడంతో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంలో గుట్టును రట్టు చేయాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి అని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.
డబ్బు ఎక్కడిదో..
జాస్ సంస్థ గుప్పెట్లోకి సినీ స్క్రీన్స్ చేరిన విధానాన్ని పరిశీలిస్తే పలు అనుమానాలు బయలు దేరుతున్నాయని కరుణానిధి వివరించారు. క్లాసిక్ మాల్ సంస్థ పేర్కొంటున్నట్టుగా గత ఏడాదే అనుమతి లభించినప్పుడు, ఇన్నాళ్లు ఆ స్క్రీన్స్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిందెవరోనన్న విషయాన్ని స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. ఆ స్క్రీన్స్ ఇటీవలే జాస్ చేతికి వచ్చిన దృష్ట్యా ఇది వరకు ఎవరికి అప్పగించారో, ఆ లీజుదారుడు ఎవరో అన్న విషయాన్ని ఎందుకు స్పష్టం చేయడం లేదని ప్రశ్నించారు. సత్యం సినిమా గుప్పెట్లో నుంచి బలవంతంగా స్క్రీన్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం దీన్ని బట్టి స్పష్టం అవుతోందన్నారు. ఆ స్కీన్స్‌లో ఏసీలు, సీట్లు, ఇలా తదితర వస్తువుల ఆధారంగా జాస్ సంస్థ కోయంబత్తూరులోని ఓ బ్యాంక్‌లో రుణాలు తీసుకుని ఉండటాన్ని వివరిస్తూ లీజు దారుడు ఇలాంటి వస్తువులను తాకట్టుబెడితే బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేస్తాయా అని ప్రశ్నించారు.
ఇలవరసి కుటుంబీకులు ఆ లీజుదారుడుగా పేర్కొంటున్న దృష్ట్యా ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, బ్యాంక్ ద్వారా ఏ మార్గంలో రుణాల్ని స్వీకరించారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యవహారంలో సీఎం జయలలిత నోరు మెదపకపోవడం శోచనీయమని విమర్శించారు. ఈ జాస్ సంస్థకు దేశ వ్యాప్తంగా 136 స్క్రీన్స్ ఉన్నట్టుగా సమాచారం వస్తోందని, ఇన్ని వేల కోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాల్సిన అవశ్యం ఉందని డిమాండ్ చేశారు. వేల కోట్ల మేరకు సాగి ఉన్న ఈ అవినీతి వ్యవహారాన్ని సీబీఐ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.