విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో పోలీసుల తంటాలు
టీనగర్: తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక పోలీసు అధికారులు తంటాలు పడుతున్నారు. సేలం జిల్లా ఓమలూర్‌కు చెందిన ఇంజినీర్ గోకుల్‌రాజ్ గతేడాది జూన్ నెలలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ(29) విచారణ చేపట్టిన రెండు నెలల్లోనే తన కార్యాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుపై ఆరంభంలో తిరుచెంగోడు పోలీసులు, తర్వాత సీబీసీఐడీ పోలీసులు విచారణ జరిపారు. దీనిపై విష్ణుప్రియ తండ్రి రవి సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది. ఇలాఉండగా సీబీఐ అధికారుల ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు ఇవ్వలేక తంటాలు పడుతున్నట్లు సమాచారం. వారంరోజుల్లో సీబీఐ అధికారులు నామక్కల్‌లో బసచేసి విచారణ జరపనున్నందున జిల్లాలోని పోలీసు అధికారుల్లో గుబులు రేగింది.