సాక్షి, ముంబై: వెలుగుల పండుగ దీపావళికి నగరం ముస్తాబైంది. వీధులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి. దీపావళి శుభాకంక్షలు తెలియజేస్తూ ఇళ్లపై ఏర్పాటు చేసిన ఆకాశదీపాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాణసంచా దుకాణాలు, గిఫ్ట్ షాపులు, పూజా సామగ్రి దుకాణాలు, మిఠాయి దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చర్చిగేట్ పరిసరాల్లోని ఫ్యాషన్ స్ట్రీట్, దాదర్ పరిసరాల్లో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా రద్దీ పెరిగినప్పటికీ శుక్రవారం మరింత ఎక్కువైంది. కొనుగోళ్ల కోసం అందరూ మార్కెట్లకు రావడంతో నడవడానికి కూడా కష్టంగా మారింది.
పెరిగిన విక్రయాలు...
ధన త్రయోదశిని పురస్కరించుకుని శుక్రవారం బంగారం, వెండి ఆభరణాలతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను కొనడం సంప్రదాయంగా వస్తుండడంతో జువెలరీ షాపులముందు జనం బారులు తీరారు. బంగారం ధర ఆకాశాన్నంటుతున్నా ఎంతో కొంత కొనుగోలు చే యాలనే అభిప్రాయంతో ఇక్కడికి వచ్చినట్లు నగరవాసులు చెబుతున్నారు. ఇక ఎలక్ట్రానిక్ దుకాణాల ముందు కూడా భారీగానే సందడి కనిపించింది. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేవారి సంఖ్య అధికంగా కనిపించింది. అమ్మకందారులు ఈఎంఐల ఆశ చూపడంతో కొనుగోలుదారులు భవిష్యత్తులో ఎలా చెల్లించాలన్న విషయాన్ని పక్కనబెట్టి మరీ వస్తువులు కొనేందుకు ఎగబడ్డారు.
కలుషితం చేయకండి: ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని దీపావళి పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు మతాలవారిలో ఐక్యతను పెంచేందుకు దోహదపడే దీపావళి పండుగకు ఎంతో ప్రాధాన్యముందని, ఈ సందర్భంగా వెలిగించే దీపాలు చీకటిని తొలగించి, పరిసరాలను కాంతిమయం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోనుంచి చీకటి తొలగిపోయి వెలుగులు నిండాలని కోరుకుంటున్నానన్నారు. టపాసులు పేల్చడం ఆనవాయితీ అయినప్పటికీ వాయు, ధ్వని కాలుష్యం కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
టపాసులులేని దీపావళి కార్యక్రమాలకు విశేష స్పందన...
పర్యావరణానికి హాని తలపెట్టవద్దన్న అభిప్రాయంతో గత మూడేళ్ల నుంచి ‘టపాసులులేని దీపావళి’ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర పర్యావరణశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండడం శుభపరిణామమని పర్యావరణ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టపాసులు పేల్చడంతో ధ్వనితోపాటు వాయి కాలుష్యం పెరుగుతుందని, ఇది ప్రజల ఆరోగ్యంపై దుష్ర్పభావాలను చూపుతుందన్నారు. దీనిపై ప్రజల్లో జాగృతి తీసుకొచ్చి టపాసులు పేల్చకుండా పండుగ జరుపుకోవాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాలల విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
భద్రత పెంపు....
దీపావళి పండుగను పురస్కరించుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల బీహార్ రాష్ర్టం పాట్నాలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సభా ప్రాంగణం వద్ద జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భద్రతను పెంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ముంబై ముందుందని, దీపావళి టపాసుల పేలుళ్లను అవకాశంగా తీసుకొని ఉగ్రమూకలు బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశముందంటూ నిఘావర్గాల నుంచి అందిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాలపై నిఘా పెంచామన్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సంఖ్యను పెంచామని, మరి కొన్ని ప్రాంతాల్లో నాకాబందీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు, వస్తువులు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముంబై పోలీసులు సూచించారు. వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
నగరానికి దీపకళ
Published Sat, Nov 2 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement