
సంబరాలు
గాలి జనార్దనరెడ్డికి బెయిల్‌తో సంబరాలు
బళ్లారిలో పండగ వాతావరణం
పెద్ద ఎత్తున బాణసంచా మోత
బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి మంగళవారం అన్ని కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో బెయిల్ లభించడంతో బళ్లారిలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మూడేళ్ల క్రితం మైనింగ్ కేసులకు సంబంధించి సీబీఐ గాలి జనార్దనరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి విదితమే. మూడేళ్లుగా హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఉన్న గాలి జనార్దనరెడ్డికి ఎట్టకేలకు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో బళ్లారిలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు, గాలి జనార్దనరెడ్డి అభిమానుల నేతృత్వంలో బళ్లారిలోని ఎస్పీ సర్కిల్, రాయల్ సర్కిల్, తాళూరు రోడ్డు సర్కిల్, ఏపీఎంసీ సర్కిల్, మోతీ సర్కిల్ తదితర అన్ని ప్రధాన కూడళ్లలో బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో సీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన నేతకు బెయిల్ లభించడంతో బళ్లారిలో పండుగ వాతావరణం నెలకొందని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని సంతోష క్షణాలు పంచుకున్నారు.
మూడేళ్లుగా గాలి జనార్దనరెడ్డి జైలులో ఉండటంతో అభిమానులతో పాటు బళ్లారిలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు కుదేలైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో బళ్లారికి తిరిగి కొత్త కళ సంతరించుకునే అవకాశం ఉందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు వీరశేఖర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు నగరంలో ర్యాలీ చేపట్టి సంబరాల్లో పాలు పంచుకున్నారు. ఇక ప్రజలు గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించిన సంగతి తెలియడంతో ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కుపోయారు. ఇక జనార్దనరెడ్డి ఒకటి రెండు రోజుల్లో విడుదల కానుండటంతో ఆయనను చూసేందుకు బెంగళూరుకు పెద్ద సంఖ్యలో వాహనాలలో తరలి వెళ్లేందుకు అభిమానులు, మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బెయిల్ లభించడం హర్షణీయం : గాలి సోమశేఖర్‌రెడ్డి
తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన సాక్షితో మాట్లాడారు. భగవంతుని కృప, బళ్లారి జిల్లా ప్రజల ఆశీస్సుల వల్ల తన సోదరునికి బెయిల్ లభించిందన్నారు. బళ్లారి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు జనార్దనరెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
బళ్లారి అభివృద్ధికి బాటలు : కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి
గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో నిస్తేజంగా ఉన్న బళ్లారి జిల్లా అభివృద్ధి చెందడం ఖాయమని బీజేపీ నేత, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గాలి జనార్దనరెడ్డి అరెస్టయినప్పటి నుంచి జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆయన నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు. గాలి బెయిల్‌తో బళ్లారిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు.