అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి?
లోక్‌సభ శీతాకాల సమావేశాలు కాగానే ప్రమాణస్వీకారం
శివసేన అధినేత ఉద్ధవ్ పచ్చజెండా
సాక్షి, ముంబై: శివసేన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి వరించనుంది. ఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశాయ్‌కి మార్గం సుగమమైంది. కొద్ది రోజుల కిందట జరిగిన రెండవ విడత కేంద్ర మంత్రి మండలి విస్తరణలో మిత్రపక్షాల కోటాలో శివసేన తరఫున దేశాయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయాల్సి ఉంది.
అయితే బీజేపీ, శివసేన మధ్య రాష్ట్రస్థాయి పొత్తులపై చర్చలు కొలిక్కిరాకపోవడంతో చివరి నిమిషంలో ఆయన ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. అయితే అప్పట్లో నెల కొన్న విభేదాలు, కలహాలు ఇప్పుడు సద్దుమణిగాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయ్యింది. దీంతో అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రిపదవి కట్ట బెట్టేందుకు మార్గం సులభతరమైంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివ ర్గంలో శివసేనకు చెందిన అనంత్ గీతే ఒక్కరే క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.
త్వరలో జరగనున్న విస్తరణలో దేశాయ్ చేరితే ఈ సంఖ్య రెండుకు చేరుతుంది. ఎన్డీయే కూటమిలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో తగిన వాటా రాలేదు. దీంతో శివసేనలో తీవ్ర అసంతృప్తి ఉంది. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణంలో దేశాయ్‌కి చోటు లభించినప్పటికీ శివసేనలో నెలకొన్న అసంతృప్తి పూర్తిగా తొలగిపోదని విశ్లేషకులు భావిస్తున్నారు.