దైవాధీనం.. ‘లోకల్’ ప్రయాణం!
Published Sun, Oct 13 2013 11:30 PM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలో వివిధ సాం కేతిక కారణాలతో రైళ్లు ఆగిపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం సాయంత్రం సెంట్రల్ రైల్వే మార్గంలోని ఠాకుర్లీ స్టేషన్‌లో దాదర్-కల్యాణ్ స్లో లోకల్ రైలులో పెంటగ్రాఫ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైలు ఆగిపోయింది. ఫలితంగా ఠాణే నుంచి కల్యాణ్ వెళ్లే లోకల్ రైళ్లన్నీ క్యూ కట్టాయి. సాంకేతిక సిబ్బంది, రైల్వే అధికారు లు రంగంలోకి దిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిం చేందుకు దివా-కల్యాణ్ స్టేషన్ల మధ్య రైళ్లను ఫాస్ట్ మార్గంలోకి దారి మళ్లించారు. దాదాపు గంట వర కు రైళ్లను దారి మళ్లించే ప్రక్రియ కొనసాగింది. దీని కారణంగా రైల్వే పరిపాలన విభాగానికి ఎనిమిది లోకల్ రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
కాగా శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ఆఫ్ డే కారణంగా ఉద్యోగుల్లో అత్యధిక శాతం అప్పటికే ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బందులేమీ పడలేదని అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ పరిస్థితి ఇలా గే ఉంటుండటంతో నగరంలోని లక్షలాదిమంది లోకల్ రైళ్లలో ప్రయాణించే వారు తాము ఇళ్లకు ఎప్పుడు చేరతామోనని దేవుడిపైనే భారం వేసి రైళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండ గా, అంబర్‌నాథ్ స్టేషన్ సమీపంలో గత మంగళవా రం రైల్వే ట్రాక్‌కు పగులివ్వడంతో రెండు గంట లపాటు రైళ్లు నిలిచిపోయాయి.
బుధవారం ఉద యం కల్యాణ్ స్టేషన్ వద్ద సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం డోంబివలిలో మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై ఓ లోకల్ రైలు పెంటగ్రాఫ్ విరిగిపోవడంతో రైలు అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులు ఈ ఘటనలు మర్చిపోక ముందే శనివారం సాయంత్రం తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. ఇలా తరచూ ఏదో ఒక స్టేషన్‌లో సాంకేతిక సమస్యలతో లోకల్ రైళ్లు ఆగిపోతున్నాయి. ప్రతి ఆదివారం మెగాబ్లాక్, జంబో మెగాబ్లాక్‌లు తీసుకుని మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ఇలాంటి సమస్యలు ఎదురుకావడం గమనార్హం.
రైలులోనే ప్రసవం
ఓ మహిళ శనివారం ఉదయం లోకల్ రైలులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకెళ్తే.. నాలాసోపారా లో నివాసముంటున్న ఖతున్బి మొహమ్మద్ శైఖ్.. నాలాసోపారాలో ఉదయం విరార్-చర్చిగేట్ ఫాస్ట్ లోకల్ రైలులో మహిళా బోగీలో ఎక్కింది. బాంద్రాలోని కార్పొరేషన్‌కు చెందిన బాబా ఆస్పత్రికి వెళ్లేం దుకు తనతోపాటు అత్తను కూడా తోడు తీసుకొచ్చింది. రైలు జోగేశ్వరి స్టేషన్ చేరుకోగానే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో పక్కనే ఉన్న ఆమె అత్త తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ప్రయాణికుల్లో ఒకరు జీఆర్‌పీ కంట్రోల్ రూంకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను, స్ట్రెచర్‌ను అంధేరి రైల్వే స్టేషన్‌లో సిద్ధంగా ఉంచారు. అయితే అంధేరి స్టేషన్ చేరుకోకముందే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మహిళను విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రికి తరలిం చారు. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని అంధేరి జీఆర్‌పీ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శివాజీ షిండే తెలిపారు.
రైలు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న మహిళ
ఒక మహిళ లోకల్ రైలు ఎక్కబోయి తన రెండు కాళ్లు కోల్పోయింది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం ఖార్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు అందించిన వివరాల మేరకు.. మాహిమ్‌లో నివాసముంటున్న దీపాలి పట్రే ఖార్ రైల్వే స్టేషన్‌లో చర్చ్‌గేట్ లోకల్ రైలు ఎక్కుతూ పొరపాటున ఫుట్‌బోర్‌డ-ప్లాట్‌ఫాం మధ్యలో కింద పడిం ది. రైలు సగభాగం ప్లాట్‌ఫాంను దాటి వెళ్లిన తర్వా త ప్రమాదాన్ని గమనించి రైలును అత్యవసరంగా నిలిపేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. అప్పటికే బాధితురాలి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో సదరు మహిళను కార్పొరేషన్‌కు చెందిన బాబా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ సంఘటనతో రైళ్లు 10 నిమిషాలపాటు ఆలస్యంగా నడిచాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement