సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయదలచిన కర్ణాటక వృత్తి విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ, ఫీజు నిర్ధారణ) చట్టం-2006పై గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీనియర్ మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ చట్టాన్ని 2006లోనే ప్రస్తుత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తీవ్రంగా వ్యతిరేకించారని వారు గుర్తు చేశారు. దీనిని అమలు చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బ తినడం ఖాయమని హెచ్చరించారు.
ఇప్పటికే కాంగ్రెస్ వెనుకబడిందని, బీజేపీ పుంజుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని అమలు చేస్తే పూర్తిగా మునిగిపోతామని హెచ్చరించినట్లు తెలిసింది. మంత్రుల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, దీనిపై ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే, వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్ పాటిల్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని రకాలైన చర్యలను చేపడతామని కూడా భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
2006 చట్టాన్ని అమలులోకి తీసుకు వస్తామని ముఖ్యమంత్రి ఢంకా బజాయించి చెబుతుండడంతో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాన్ని కోరుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రాష్ర్టంలో 1994 వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) సాఫీగానే సాగుతూ వచ్చింది. 2002లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలు సొంతంగా తామే ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి కామెడ్-కేను ఏర్పాటు చేసుకున్నాయి. అప్పట్లో ఎస్‌ఎం. కృష్ణ ముఖ్యమంత్రి కాగా ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆడిందే ఆటగా సాగింది.
సీఈటీలో మంచి ర్యాంకులు సాధించి వారికి కూడా ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు లభించలేదు. దీనిపై అప్పట్లో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించ లేనందుకు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. 2004 శాసన సభ ఎన్నికల్లో ఇది ప్రతిబింబించింది. 2006లో ప్రస్తుతం అమలు చేయదలచిన చట్టాన్ని తీసుకు వచ్చినప్పుడు మళ్లీ వివాదం తలెత్తింది.
అయితే అప్పట్లో సంకీర్ణ ప్రభుత్వాల మనుగడ ‘నిత్య గండం-పూర్ణాయుష్షు’లా పరిణమించడంతో అమలు చేసే సాహసం చేయలేక పోయాయి. తదుపరి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలతో ఎప్పటికప్పుడు చర్చల ద్వారా అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం అదే విద్యా సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముడు పోయిందనే ఆరోపణలు విద్యార్థి లోకంలో వెల్లువెత్తుతున్నాయి.
సంకటంలో హై-క విద్యార్థులు
రాజ్యాంగంలో 371(జే) అధికరణను చేర్చడం ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం వారికి 85 శాతం సీట్లు దక్కాల్సి ఉంది. ప్రభుత్వం 2006 చట్టాన్ని అమలు చేయాలని సంకల్పించినందున గుల్బర్గ డివిజన్‌లోని ఆరు జిల్లాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలలు వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలో ఉండడమే దీనికి కారణం. ముఖ్యంగా వైద్య విద్యలో ప్రవేశాలు అందని ద్రాక్ష పండు లాగా పరిణమించనున్నాయి.
పుట్టి ముంచుతుందేమో..!
Published Fri, Dec 20 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement