Moily
-
మంత్రులపై ఎమ్మెల్యేల కన్నెర్ర
పట్టించుకోవడం లేదని ఆవేదన ఫోన్ చేసినా స్పందన లేదంటూ ఆక్రోశం జిల్లాల పర్యటనలు లేవని మండిపాటు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా మంత్రుల్లో మార్పు రావడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఫోన్లోనూ దొరకడం లేదు. మంత్రులే మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక అధికారులు మా మాటకు విలువ ఇస్తారా’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. విధాన సౌధలోని కాన్ఫరెన్స్ హాలులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ప్రృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రుల తీరును తూర్పారబట్టారు. కన్నడ, సాంృస్కతిక వ్యవహారాలు, ృహ నిర్మాణ, విద్యుత్, ప్రజా పనులు, వ్యవసాయ శాఖల మంత్రులు తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. వీరంతా మద్దతుదారుల మాటకు మాత్రమే విలువనిస్తున్నారని విమర్శించారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేల విన్నపాలపై స్పందించడం లేదన్నారు. జిల్లాల పర్యటనలకు కూడా రావడం లేదని ఆరోపించారు. అభిృద్ధి పనులను సమీక్షించడం లేదన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తమ పనులు ఎలా చేయించుకోవాలని నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. పాలక పార్టీలో ఉండి కూడా పనులు కావడం లేదంటే, నియోజక వర్గం ప్రజల ముందు తమ పరువేం కావాలని వాపోయారు. శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం. ఇబ్రహీంను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడుగా నియమించడంపై అసంృప్తి వ్యక్తం చేశారు. ఇంకొంత కాలం ఆగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యేలను అనునయించడానికి ప్రయత్నించారు. అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నించిన తన వైపు వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున, పార్టీలో ఐక్యత అవసరమని సూచించారు. గురువారం మంత్రులందరూ ఎమ్మెల్యేలకు రెండు గంటల పాటు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను ఆలకించి పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొని ఉంటే, ఉత్తమ ఫలితాలను సాధించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
రిలయన్స్ తో మొయిలీ కుమ్మక్కు
రూ. కోట్లు దోచుకున్నారు ఆధారాలను ఢిల్లీలోని పాత్రికేయుడికి ఇచ్చా త్వరలో పదవికి రాజీనామా చిక్కబళ్లాపురం డీసీసీ అధ్యక్షుడు అంజనప్ప చిక్కబళ్లాపురం : కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వీరప్ప మొయిలీ, రిలయన్స్ కంపెనీ అధినేత అనిల్‌అంబానీతో కుమ్మక్కై రూ. కోట్లు దోచుకున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అంజనప్ప ఆరోపించారు. సోమవారం ఆయనిక్కడి అంబేద్కర్ భవన్లో మాట్లాడుతూ.. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మంగళూరు నుంచి చిక్కబళ్లాపురానికి వలస వచ్చిన మొయిలీ గెలుపు కోసం 2009 ఎన్నికల్లో తాను కృషి చేశానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబళ్లాపురం సీటు తనకు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఇటీవల తన ఇంటికి వచ్చి విధానపరిషత్ సభ్యుడిగా చేస్తానని చెప్పి మళ్లీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, మొయిలీ గెలుపు కోసం రూ. కోట్లను ఖర్చు చేశారని తెలిపారు. మొయిలీ కుంభకోణాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఢిల్లీలోని ఓ సీనియర్ పాత్రికేయుడికి అందజేశానని చెప్పారు. ఎత్తినహొళె పేరుతో ఈ ప్రాంత వాసులను మొయిలీ మోసం చేస్తున్నారన్నారు. అది ఓ చిన్న కాలువ మాత్రమేనని, దానితో ఈ ప్రాంతవాసుల తాగునీటి సమస్య తీరదని అన్నారు. తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని, త్వరలో మద్దతుదారులతో సమావేశమై రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ విభాగం సభ్యులు సిద్దలింగాచారి, వీణారాము, లక్ష్మణ్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు. -
గెలుపు గుర్రాలేవి?
రాజకీయ పార్టీల్లో కదలిక.. బలమైన అభ్యర్థుల కోసం గాలింపు 26 వరకూ అభ్యర్థుల వేట! తుది జాబితా తయారీకి కసరత్తు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. జనవరి లేదా ఫిబ్రవరిలో తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించేస్తామని రాజకీయ పార్టీలు డిసెంబరులో ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. చాలా సీట్లలో అభ్యర్థిత్వాల కోసం పోటీ కన్నా, బలమైన అభ్యర్థుల కోసం రెండు జాతీయ పార్టీలు కాగడా పట్టి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్‌కు అంగ బలం, అర్థ బలం ఉన్నప్పటికీ, అభ్యర్థుల ఎంపికలో విపరీతమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 26 వరకు అవకాశం ఉన్నందున, అభ్యర్థుల వేట అప్పటి వరకు సాగినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ తొమ్మిది మంది ప్రస్తుత ఎంపీలకు టికెట్లను ఇదివరకే ఖరారు చేసింది. వారిలో కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ (చిక్కబళ్లాపురం), మల్లిఖార్జున ఖర్గే (గుల్బర్గ), కేహెచ్. మునియప్ప (కోలారు), ధరం సింగ్ (బీదర్), హెచ్. విశ్వనాథ్ (మైసూరు), ధ్రువ నారాయణ (చామరాజ నగర), జయప్రకాశ్ హెగ్డే (ఉడిపి-చిక్కమగళూరు), డీకే. సురేశ్ (బెంగళూరు గ్రామీణ), నటి రమ్య (మండ్య) ఉన్నారు. ఉత్తర కన్నడ, బెంగళూరు (ఉత్తర) స్థానాలకు కేపీసీసీ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థల పదాధికారులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఓటింగ్ ద్వారా అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియను కాంగ్రెస్ తొలి సారిగా చేపట్టింది. ఉత్తర కన్నడకు ఇదివరకే ఎన్నికను నిర్వహించగా, బెంగళూరు ఉత్తరలో చేపట్టాల్సి ఉంది. మూడు రోజుల్లో బీజేపీ జాబితా మరో మూడు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌తో కలసి బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు తాము ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నామని వెల్లడించారు. గత నవంబరు నుంచే తాము ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు. దేశంలో లేదా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. రాష్ట్రంలో 20కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
పీణ్యా టు మల్లేశ్వరం మెట్రో పరుగులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని పీణ్యా నుంచి మల్లేశ్వరంలోని సంపిగె రోడ్డు వరకు మెట్రో రైలు సంచారం శనివారం ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి రాజాజీ నగర స్టేషన్లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఈ రైలుకు లాంఛనంగా పచ్చ జెండా ఊపారు. అనంతరం కంఠీరవ స్టేడియంలో మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శంకు స్థాపన చేశారు. మెట్రో రీచ్-3గా వ్యవహరించే ఈ పనులకు మొత్తం 1.30 లక్షల టన్నుల సిమెంటును వినియోగించారు. 44,500 టన్నుల స్టీల్, 2,900 టన్నుల హైటెన్షన్ తీగలను ఉపయోగించారు. మొత్తం 395 కాంక్రీటు పిల్లర్లు నిర్మించగా, నాలుగు వేల మంది కార్మికులు, మూడు వందల మంది ఇంజనీర్లు పనుల్లో పాలు పంచుకున్నారు. ఈ మార్గంలోని మొత్తం 10 స్టేషన్లలో 30 ఏళ్లకు సరిపడా సదుపాయాలను ప్రయాణికులకు కల్పించారు. కాగా ఈ రైళ్లకు ఫీడర్ సర్వీసులుగా మెజిస్టిక్ నుంచి సంపిగె రోడ్డు వరకు శనివారం నుంచి బీఎంటీసీ షటిల్ సర్వీసులను నడపనున్నారు. ఎంజీ రోడ్డులోని మెట్రో స్టేషన్ నుంచి కూడా ఫీడర్ సర్వీసులను నడపడానికి బీఎంటీసీ సన్నాహాలు చేస్తోంది. -
పుట్టి ముంచుతుందేమో..!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయదలచిన కర్ణాటక వృత్తి విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ, ఫీజు నిర్ధారణ) చట్టం-2006పై గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీనియర్ మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ చట్టాన్ని 2006లోనే ప్రస్తుత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తీవ్రంగా వ్యతిరేకించారని వారు గుర్తు చేశారు. దీనిని అమలు చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బ తినడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ వెనుకబడిందని, బీజేపీ పుంజుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని అమలు చేస్తే పూర్తిగా మునిగిపోతామని హెచ్చరించినట్లు తెలిసింది. మంత్రుల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, దీనిపై ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే, వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్ పాటిల్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని రకాలైన చర్యలను చేపడతామని కూడా భరోసా ఇచ్చినట్లు తెలిసింది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం 2006 చట్టాన్ని అమలులోకి తీసుకు వస్తామని ముఖ్యమంత్రి ఢంకా బజాయించి చెబుతుండడంతో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాన్ని కోరుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రాష్ర్టంలో 1994 వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) సాఫీగానే సాగుతూ వచ్చింది. 2002లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలు సొంతంగా తామే ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి కామెడ్-కేను ఏర్పాటు చేసుకున్నాయి. అప్పట్లో ఎస్ఎం. కృష్ణ ముఖ్యమంత్రి కాగా ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆడిందే ఆటగా సాగింది. సీఈటీలో మంచి ర్యాంకులు సాధించి వారికి కూడా ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు లభించలేదు. దీనిపై అప్పట్లో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించ లేనందుకు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. 2004 శాసన సభ ఎన్నికల్లో ఇది ప్రతిబింబించింది. 2006లో ప్రస్తుతం అమలు చేయదలచిన చట్టాన్ని తీసుకు వచ్చినప్పుడు మళ్లీ వివాదం తలెత్తింది. అయితే అప్పట్లో సంకీర్ణ ప్రభుత్వాల మనుగడ ‘నిత్య గండం-పూర్ణాయుష్షు’లా పరిణమించడంతో అమలు చేసే సాహసం చేయలేక పోయాయి. తదుపరి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలతో ఎప్పటికప్పుడు చర్చల ద్వారా అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం అదే విద్యా సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముడు పోయిందనే ఆరోపణలు విద్యార్థి లోకంలో వెల్లువెత్తుతున్నాయి. సంకటంలో హై-క విద్యార్థులు రాజ్యాంగంలో 371(జే) అధికరణను చేర్చడం ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం వారికి 85 శాతం సీట్లు దక్కాల్సి ఉంది. ప్రభుత్వం 2006 చట్టాన్ని అమలు చేయాలని సంకల్పించినందున గుల్బర్గ డివిజన్లోని ఆరు జిల్లాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలలు వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలో ఉండడమే దీనికి కారణం. ముఖ్యంగా వైద్య విద్యలో ప్రవేశాలు అందని ద్రాక్ష పండు లాగా పరిణమించనున్నాయి.