- రూ. కోట్లు దోచుకున్నారు
- ఆధారాలను ఢిల్లీలోని పాత్రికేయుడికి ఇచ్చా
- త్వరలో పదవికి రాజీనామా
- చిక్కబళ్లాపురం డీసీసీ అధ్యక్షుడు అంజనప్ప
చిక్కబళ్లాపురం : కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వీరప్ప మొయిలీ, రిలయన్స్ కంపెనీ అధినేత అనిల్‌అంబానీతో కుమ్మక్కై రూ. కోట్లు దోచుకున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అంజనప్ప ఆరోపించారు. సోమవారం ఆయనిక్కడి అంబేద్కర్ భవన్‌లో మాట్లాడుతూ.. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
మంగళూరు నుంచి చిక్కబళ్లాపురానికి వలస వచ్చిన మొయిలీ గెలుపు కోసం 2009 ఎన్నికల్లో తాను కృషి చేశానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబళ్లాపురం సీటు తనకు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఇటీవల తన ఇంటికి వచ్చి విధానపరిషత్ సభ్యుడిగా చేస్తానని చెప్పి మళ్లీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, మొయిలీ గెలుపు కోసం రూ. కోట్లను ఖర్చు చేశారని తెలిపారు.
మొయిలీ కుంభకోణాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఢిల్లీలోని ఓ సీనియర్ పాత్రికేయుడికి అందజేశానని చెప్పారు. ఎత్తినహొళె పేరుతో ఈ ప్రాంత వాసులను మొయిలీ మోసం చేస్తున్నారన్నారు. అది ఓ చిన్న కాలువ మాత్రమేనని, దానితో ఈ ప్రాంతవాసుల తాగునీటి సమస్య తీరదని అన్నారు. తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని, త్వరలో మద్దతుదారులతో సమావేశమై రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ విభాగం సభ్యులు సిద్దలింగాచారి, వీణారాము, లక్ష్మణ్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.