చర్యలకు కారణం ఏమిటి?
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) నిధుల అక్రమ మళ్లింపులో అనిల్ అంబానీ ప్రధాన పాత్ర పోషించినట్లు సెబీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆడిటింగ్ తదితరాల వివరాలను బయటపెట్టింది. వీటి ప్రకారం అప్పటి కంపెనీ బోర్డు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సంబంధిత యాజమాన్యం వీటిని పట్టించుకోలేదు. కంపెనీ విధానాలను వ్యతిరేకంగా రుణాలను విడుదల చేసింది.
అసంపూర్తి డాక్యుమెంటేషన్, క్రెడిట్ పాలసీ నిబంధనల ఉల్లంఘన ద్వారా రుణ మంజూరీ జరిగింది. రుణ విడుదల అంశాలను సమీక్షిస్తూ బోర్డు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. వెరసి సాధారణ కార్పొరేట్ రుణ విధానాలకు పాతరవేశారు. వీటన్నిటి వెనుక మాస్టర్‌మైండ్ అనిల్ అంబానీదేనని సెబీ అభిప్రాయపడింది. ఇతర వివరాలు ఇలా..
ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నిధుల అక్రమ మళ్లింపు జరిగినట్లు కంపెనీకి చట్టబద్ధ ఆడిటర్‌గా వ్యవహరించిన పీడబ్ల్యూసీ, ఫోరెన్సిక్ ఆడిటర్ గ్రాంట్ థార్న్‌టన్ వెల్లడించాయి. గ్రాంట్ థార్న్‌టన్‌ను రుణదాతల కన్సార్షియంకు అధ్యక్షత వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నియమించింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం సాధారణ కార్పొరేట్ లోన్ ప్రొడక్ట్‌లో భాగంగా విడుదల చేసిన రుణాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.
2018 మార్చి31కల్లా రూ. 900 కోట్ల రుణాలు విడుదలకాగా.. 2019 మార్చి31కల్లా రూ. 7,900 కోట్లకు జంప్‌చేశాయి. రుణగ్రహీత సంస్థలలో నెగిటివ్ నెట్‌వర్త్, అతితక్కువ ఆదాయం, బిజినెస్ కార్యకలాపాలు, లాభార్జన లేకపోవడం తదితర పలు ప్రతికూలతలున్నాయి. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి మాత్రమే రుణాలను పొందడం, రుణాలతో పోలిస్తే తక్కువ ఈక్విటీ మూలధనం, రుణాలు అందుకునే ముందుగానే ఏర్పాటుకావడం, రుణ దరఖాస్తు రోజునే రుణ మంజూరీ తదితర అక్రమాలు నెలకొన్నాయి.
ఇక 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్‌వరకూ బీవోబీ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ తొలి నివేదిక 2020 జనవరిలో వెలువడింది. ఈ కాలంలో కార్పొరేట్ రుణ విధానాలకింద ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి రూ. 14,577 కోట్లకుపైగా రుణాలు విడుదలయ్యాయి. వీటిలో రూ. 12,487 కోట్లకుపైగా నిధులు సంబంధిత 47 సంస్థలకే చేరాయి. 2019 అక్టోబర్ 31కల్లా రూ. 7,984 కోట్ల రుణాలు వసూలుకావలసి ఉంటే.. దాదాపు రూ. 2,728 కోట్లు మొండిబకాయిలుగా నమోదయ్యాయి. తదుపరి నివేదికలలో గ్రూప్‌లోని పలు ఇతర కంపెనీలకు సైతం రుణాలు విడుదలైనట్లు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment