రిజిస్టర్డ్ మధ్యవర్తుల ద్వారానే లావాదేవీలు
ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికార వర్చువల్ ట్రేడింగ్ లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేవలం రిజిస్టర్డ్ ఇంటర్‌మీడియరీల (మధ్యవర్తిత్వ సంస్థలు) ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సూచించింది. యాప్‌లు/వెబ్ అప్లికేషన్లు/ప్లాట్‌ఫామ్‌లపై లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరల ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ లేదా ఫాంటసీ గేమ్‌లు ఆఫర్ చేస్తున్నట్టు సెబీ దృష్టికి వచ్చింది.
ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీస్ చాంట్రాక్ట్ (రెగ్యులేషన్స్) చట్టం, 1956, సెబీ చట్టం 1992కు విరుద్ధమని, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్టు సెబీ తెలిపింది. రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే పెట్టుబడులు, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. ‘‘అనధికారిక పథకాల్లో పాల్గొనడం, వ్యక్తిగత కీలక సమాచారాన్ని పంచుకోవడం ఇన్వెస్టర్ల సొంత రిస్క్, పైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలకు ఇన్వెస్టర్లే బాధ్యులు. ఎందుకంటే ఆయా సంస్థలు సెబీ వద్ద నమోదైనవి కావు. కనుక ఆయా సంస్థలతో నిర్వహించే లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు పెట్టుబడిదారుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కార విభాగం తదితర సెబీ యంత్రాంగాలు అందుబాటులో ఉండవు’’ అని స్పష్టం చేసింది.
విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..
మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విషయంలో సెబీ కొంత ఉపశమనాన్ని కల్పించనుంది. భారత సెక్యూరిటీల్లో విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన మేరకు.. ఆయా విదేశీ పథకాల్లో భారత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ తాజాగా ప్రకటించింది. అయితే ఆయా విదేశీ ఫండ్స్ భారత పెట్టుబడులు వాటి నిర్వహణ ఆస్తుల్లో 25 శాతానికి మించకూడదని పేర్కొంది.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు సెబీ తాజా నిర్ణయం వీలు కల్పించనుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. ఫండ్స్ పెట్టుబడుల విలువ సెబీ పరిమితులను మించితే నిబంధనలకు అనుగుణంగా తగ్గించుకునేందుకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment