మార్కెట్లో చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలు ఎన్నో ఉంటాయి. ఇన్వెస్టర్లు కేవలం మెరుగైన రాబడుల దృష్టితోనే కంపెనీలను ఎంపిక చేసుకోకూడదు. పెట్టుబడులకు రక్షణ ఉండాలి. అదే సమయంలో దీర్ఘకాలంలో కాస్తంత మెరుగైన రాబడులు ఆశించాలి. ఈ దృష్ట్యా చూస్తే ఫ్లెక్సీక్యాప్ పథకాలు అనుకూలమైనవి. ఇవి లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తూ.. అదే సమయంలో అధిక రాబడుల కోణంలో మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు సైతం కొంత చొప్పున కేటాయింపులు చేస్తుంటాయి. ఈ విభాగంలో కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. తమ పెట్టుబడులకు కొంత రిస్క్ ఉన్నా ఫర్వాలేదని భావించే వారికి ఈ విభాగం అనుకూలంగా ఉంటుంది.
రాబడులు
అన్ని కాలాల్లోనూ మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. గడిచిన ఆరు నెలల్లో ఈ పథకంలో రాబడి 15 శాతంగా ఉంది. ఏడాదిలో 21 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే పెట్టుబడులపై వార్షిక ప్రతిఫలం 21 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో ఏటా 15.52 శాతం చొప్పున, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో ఏటా 17.63 శాతం చొప్పున ఈ పథకం ఇన్వెస్టర్లకు రాబడిని తెచ్చి పెట్టింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకం పదేళ్ల కాలంలో మెరుగ్గా పనిచేసింది. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐతో పోలిస్తే ఏడాది, పదేళ్ల కాలంలో మెరుగైన రాబడిని అందించింది. గత మూడేళ్లలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురైన పరిస్థితులు చూశాము. పైగా ఈక్విటీల్లో కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూచన. కనుక ఐదేళ్లు, అంతకుమించి కాలానికి రాబడులనే ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఈ పథకం మెరుగైన పనితీరును చూపించింది.
పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో
మల్టీక్యాప్ ఫండ్స్ అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే లార్జ్‌క్యాప్‌తోపాటు, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో ఎప్పుడూ అన్ని విభాగాలు ఒకే రీతిలో పని చేస్తాయని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ర్యాలీ ఉండొచ్చు. గడిచిన ఆరు నెలల్లో చూసినట్టు.. కొన్ని సందర్భాల్లో మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు లార్జ్‌క్యాప్ కంటే అధిక రాబడులు ఇస్తుంటాయి. దీర్ఘకాలంలోనూ వీటి మధ్య రాబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. కనుక మల్టీక్యాప్ ఫండ్స్ అన్నింటి మిశ్రమంగా పనిచేస్తాయి.
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.40,685 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 76 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 23.49 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు ఒక శాతంలోపే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 52 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 27 శాతం మేర ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీలకు 11.60 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 8.77 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 7.48 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 6.82 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment