- రాజకీయ పార్టీల్లో కదలిక..
- బలమైన అభ్యర్థుల కోసం గాలింపు
- 26 వరకూ అభ్యర్థుల వేట!
- తుది జాబితా తయారీకి కసరత్తు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. జనవరి లేదా ఫిబ్రవరిలో తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించేస్తామని రాజకీయ పార్టీలు డిసెంబరులో ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. చాలా సీట్లలో అభ్యర్థిత్వాల కోసం పోటీ కన్నా, బలమైన అభ్యర్థుల కోసం రెండు జాతీయ పార్టీలు కాగడా పట్టి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్‌కు అంగ బలం, అర్థ బలం ఉన్నప్పటికీ, అభ్యర్థుల ఎంపికలో విపరీతమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోంది.
నామినేషన్ల దాఖలుకు ఈ నెల 26 వరకు అవకాశం ఉన్నందున, అభ్యర్థుల వేట అప్పటి వరకు సాగినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ తొమ్మిది మంది ప్రస్తుత ఎంపీలకు టికెట్లను ఇదివరకే ఖరారు చేసింది. వారిలో కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ (చిక్కబళ్లాపురం), మల్లిఖార్జున ఖర్గే (గుల్బర్గ), కేహెచ్. మునియప్ప (కోలారు), ధరం సింగ్ (బీదర్), హెచ్. విశ్వనాథ్ (మైసూరు), ధ్రువ నారాయణ (చామరాజ నగర), జయప్రకాశ్ హెగ్డే (ఉడిపి-చిక్కమగళూరు), డీకే. సురేశ్ (బెంగళూరు గ్రామీణ), నటి రమ్య (మండ్య) ఉన్నారు.
ఉత్తర కన్నడ, బెంగళూరు (ఉత్తర) స్థానాలకు కేపీసీసీ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థల పదాధికారులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఓటింగ్ ద్వారా అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియను కాంగ్రెస్ తొలి సారిగా చేపట్టింది. ఉత్తర కన్నడకు ఇదివరకే ఎన్నికను నిర్వహించగా, బెంగళూరు ఉత్తరలో చేపట్టాల్సి ఉంది.
మూడు రోజుల్లో బీజేపీ జాబితా
మరో మూడు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌తో కలసి బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు తాము ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నామని వెల్లడించారు. గత నవంబరు నుంచే తాము ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు. దేశంలో లేదా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. రాష్ట్రంలో 20కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.