సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లను నేరుగా ప్రభావితం చేసే బదులు వారిని ప్రభావితం చేసే వ్యక్తులపై దృష్టి సారించాయి. వారి మద్దతు కూడగడితే సరిపోతుందన్న భావనతో ప్రత్యేక ప్యాకేజీలతో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య అధికం కావడంతో ఇంటింటి ప్రచారం చేయడం అభ్యర్థులకు కష్టమే. దీంతో రాజకీయ పార్టీలు ఓటర్లకు బదులుగా ఇలా ఓటర్లను ప్రభావితం చేసే వారివైపు దృష్టి పెట్టాయి. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేత మొదలు గ్రామస్థాయి నేతలనూ ఇలా ప్రత్యేక ప్యాకేజీలతో ప్రసన్నం చేసుకొనే పనిలో అభ్యర్థులు తలమునకలయ్యారు.
ఓటర్ల సంఖ్యకు తగిన ప్రాధాన్యత...
పట్టణ ప్రాంతాల్లో వార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలవారీగా ప్రత్యేక సమయాన్ని నిర్దేశించుకొని ఎన్నికల ప్రచారంచేస్తున్న అభ్యర్థులు... ఓటర్లను ప్రభావితం చేసే వారిని వెతికి పట్టుకునేందుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా స్థాయిని బట్టి వారితో చర్చిస్తున్నారు. ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనే అంశం ప్రాతిపదికగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీగా ఓటర్ల మద్దతు కూడగట్టగల వారికి ప్రత్యేక ప్యాకేజీలు సైతం ఇచ్చేస్తున్నారు.
వెయ్యి, ఐదు వేలు, పది వేలు ఇలా ఓటర్ల సంఖ్యకు తగినట్లు గుర్తింపు ఇస్తూ ఆ మేరకు బహుమతులు సైతం అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఎక్కువ మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటే ఏకంగా అభ్యర్థి సమక్షంలోనే తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. అలా వచ్చిన వారికి దావత్‌లు ఇస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ నియోజకవర్గాలైన ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇలాంటి దావత్‌లు జోరుగా సాగుతున్నాయి.
అంతటా ఇదే మంత్రం...
ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అన్ని సెగ్మెంట్లలో ఇలాంటి వ్యక్తులపై అభ్యర్థులు గురిపెడుతున్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఈ తరహా వ్యక్తులకు భారీ మొత్తంలో బహుమతులు అందిస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కాలనీలు, వార్డుల్లో క్రియాశీల వ్యక్తులను భారీ సభలు నిర్వహించి పార్టీల్లో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా యువతను ప్రభావితం చేసే యువ నాయకులకూ అందలం వేస్తున్న అభ్యర్థులు వారి డిమాండ్లకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదాహరణకు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరకు వేరే పార్టీ నుంచి పోటీ చేసి 20 వేలకుపైగా ఓట్లు సాధించారు. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న ఆయన్ను ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆ అభ్యర్థికి సహకరించేందుకు ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment