
కళ్లార్పకుండా.. కమిట్‌మెంట్‌తో అబద్ధాలు
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో సీఎం చంద్రబాబునాయుడు తనకు తానే సాటి అని మరోసారి చాటుకున్నారు.
వెలిగొండను నేనే పూర్తి చేశా
కరువు లేకుండా చేశా
సీమలో 24 గంటలు వ్యవసాయ విద్యుత్ ఇచ్చా
శాసన మండలిలో సీఎం కనికట్టు
సాక్షి, హైదరాబాద్: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో సీఎం చంద్రబాబునాయుడు తనకు తానే సాటి అని మరోసారి చాటుకున్నారు. 1995 నుంచి 2004 వరకూ తాను అధికారంలో ఉన్నంతకాలం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులను చేపడితే... వాటినెలా పూర్తి చేస్తారని చంద్రబాబు విమర్శించారు. కానీ శనివారం శాసనమండలిలో... వైఎస్సార్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను తానే చేపట్టినట్లు, ఆ ఘనత తనదేనన్నట్లు చెప్పుకోవడంపై టీడీపీ నేతలే ముక్కున వేలేసుకుంటుండటం గమనార్హం. మండలిలో చంద్రబాబు వ్యాఖ్యలను, అసలు వాస్తవాలనూ పరిశీలిద్దాం...
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని నేనే చేపట్టా. పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) వరకూ హంద్రీ-నీవా ప్రధాన కాలువను వెడల్పు చేస్తా. వరద వచ్చినపుడు అధికంగా నీటిని తీసుకెళ్తా. డిసెంబర్ నాటికి మడకశిర కుప్పం నియోజకవర్గాలకు నీళ్లందిస్తా.
ఇదీ వాస్తవం: హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులకు 1996లో, 1999లో రెండుసార్లు చంద్రబాబు పునాదిరాయి వేసి అటకెక్కించారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవాను చేపట్టి తొలి దశను పూర్తి చేశారు. రెండో దశ పనుల్లో 50 శాతం పనులను పూర్తి చేశారు. ఈ ఏడాది ఈ తొలి దశ ఆయకట్టుకింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉండగా... ఒక్క ఎకరానికి కూడా నీళ్లందించిన పాపాన పోలేదు.
రాయలసీమ రాళ్లసీమగా మారుతోందని మొన్నటివరకూ ఆందోళనలు చేశారు. ఇక అలాంటి ఆందోళనలు వద్దు. సాగునీళ్లందించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తా.
వాస్తవం: తెలుగు గంగ ఆయకట్టు కింద వైఎస్సార్ జిల్లాలో ఒక్క ఎకరం కూడా సాగు చేయలేదు. కేసీ కెనాల్ కింద ఏడు వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశారు. ఆ పంటలకూ నీళ్లందక ఎండిపోతున్నాయి. హెచ్చెల్సీ కింద ఒక్క ఎకరానికి కూడా నీటిని విడుదల చేయలేదు. కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ కింద పది వేల ఎకరాల్లో సాగు చేసిన ఆరు తడి పంటలు కూడా నీళ్లందక ఎండిపోతున్నాయి.
వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేనే పూర్తి చేశా
వాస్తవ చిత్రం: 1996 మధ్యంతర ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు పునాదిరాయి వేసినా పనులు మొదలు పెట్టలేదు. వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే రూ.5,150 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆయన హయాంలో రూ.2,850 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన పనులు పూర్తిచేయడంపై చంద్రబాబు దృష్టి సారించడం లేదు. కానీ.. ఆ ప్రాజెక్టు పూర్తయినట్లు పచ్చి అబద్ధాలు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు.
రెయిన్‌గన్లు, నీటి ట్యాంకర్లతో 4,69,462 ఎకరాల విస్తీర్ణంలో నీటి ఎద్దడికి గురయిన వేరుశనగ, కంది, అపరాలు, ప్రత్తి, మిరప, మొక్కజొన్న వంటి పంటలకు నీటి తడులను ఇచ్చి పంటలను రక్షించాము.
నిజం ఇదీ: 9.88 లక్షల (నాలుగు లక్షల హెక్టార్లు) ఎకరాల్లో పంట చేతికి రాకుండానే ఎండిపోయింది. ఈనెల మొదటి వారానికి రాష్ట్రంలోని మొత్తం 670 మండలాలకు 309 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలినాళ్లలో విత్తిన 6,33,235 హెక్టార్లలో 4 లక్షలకు పైగా హెక్టార్ల వేరుశనగ పంట ఎండిపోయింది. ఈ అంశాన్ని వ్యవసాయ శాఖ గుర్తించినా బయటపెట్టలేదు.
కరువును పారదోలేందుకు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 24 గంటల వ్యవసాయ విద్యుత్ ఇచ్చా. ఇతర కరువు ప్రాంతాల్లో ఏడు గంటలకు మరో రెండు గంటలు అదనంగా విద్యుత్ ఇచ్చా. నా హయాంలో మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రం పయనిస్తోంది.
వాస్తవ చిత్రం: అదనపు విద్యుత్ ప్రకటనకు ముందు రాష్ట్రంలో 172 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటే.. ప్రకటన తర్వాత ఇది రోజుకు 168 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కో ఉత్పత్తిని సగటున రోజుకు 105 మిలియన్ యూనిట్ల నుంచి 51 మిలియన్ యూనిట్లకు తగ్గించి, దాని స్థానంలో ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటికీ డిస్కమ్‌లకు రూ. 14 వేల కోట్ల రుణభారం ఉంది. ఈ తరహాలో విద్యుత్ కొనుగోలు చేసి.. దాన్ని మిగులుగా చెప్పుకుంటున్నారు.