షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ గురువారం తన రాజీనామాను వాపస్ తీసుకున్నారు.
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ గురువారం తన రాజీనామాను వాపస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మంచి నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, దీంతో కుర్చి ఖాళీ చేయాలని పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నినాదాలు చేయడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 22 ఏళ్ల తన పదవీకాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొన్నానని, తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కుర్చి ఖాళీ చేయాలని ఆందోళన చేయడంతో నిరాశకు గురయ్యానని, దీంతో తన రాజీనామ లేఖను సమర్పించానని గూడెంవార్ తెలిపారు.
పట్టణ వాసుల అభిమానం వల్ల తాను చేసింది తప్పని తెలుసుకొని రాజీనామా వాపస్ తీసుకున్నానన్నారు. అయితే పట్టణ వాసులకు నీటి సమస్య లేకుండా చేస్తానని ఈ సందర్భంగా హామి ఇచ్చారు. పట్టణానికి సంబంధించి అభివృద్ధి పనులు చేసినందుకుగాను సుశీల్ కుమార్ షిండే కూడా తనను అభినందించారని, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించని ఎన్నో సమస్యలను తాను పరిష్కరించానన్నారు. టాక్లీ నుంచి సోరేగావ్ వరకు రూ.167 కోట్లతో మంచినీటి పైప్‌లైన్ వేయాలనే ప్రతిపాదన ఉందని, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోందన్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే శాశ్వతంగా మంచినీటి సరఫరా పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఇందుకు కార్పొరేటర్లు కూడా సహకరించాలన్నారు.
ఇక మీదట ఏ పని చేపట్టినా కార్పొరేటర్లతో చర్చిస్తానని విలేకరుల సమావేశంలో చంద్రకాంత్ గూడెంవార్ తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో తన పదవికి రాజీనామా చేయడంతో చంద్రకాంత్‌ను తిరిగి కమిషనర్ పదవిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 7వ తేదీన షోలాపూర్‌లో కాంగ్రెస్ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సంతకాల సేకరణ, మోర్చా నిర్వహించిన స్థానిక నాయకులు అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. ఫలితంగా గూడెంవార్ తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు.