కాంగ్రెస్‌లో మదనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీఎస్‌వైకి కట్టబెట్టిన నేపథ్యంలో ఇతర పార్టీల్లో తర్జన భర్జన
చుక్కాని లేని నావలా కాంగ్రెస్
వాయిదా పడుతున్న కేపీసీసీ చీఫ్ ఎంపిక
మారుతున్న రాజకీయ సమీకరణలు
బెంగళూరు: రాష్ట్ర రాజకీయాల్లో సమీకర ణలు మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నియమక ప్రకటన వెలువడిన వెంటనే ఇందుకు నాంది పడింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. రాష్ట్రంలో మరో రెండేళ్లలో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన యడ్యూరప్పకు కర్ణాటకశాఖ అధ్యక్ష పదవి ఇస్తూ కమలనాథులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలను లింగాయత్, ఒక్కలిగ వర్గాలు శాసిస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో లింగాయత్ సముదాయానికి చెందిన యడ్యూరప్పకు కమలనాథులు రాష్ట్ర అధ్యక్షస్థానం కట్టబెట్టారు. మొదటి నుంచి దూకుడు స్వభావం కలిగిన వ్యక్తిగా పేరొందారు. అధికారంలో ఉన్నా....ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ ప్రత్యర్థుల తప్పులను సూటిగా పట్టిచూపడంతో పాటు ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం యడ్యూరప్పకు వెన్నతోపెట్టిన విద్య అని రాజకీయ ప్రత్యర్థులు సైతం కాదనలేని సత్యం.
ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థ పార్టీలైన కాంగ్రెస్ నాయకులు యడ్డీ చర్యలకు దీటుగా ప్రతిస్పందించే నాయకుల వేటలో పడ్డాయి. కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రస్తుత అధ్యక్షుడి పదవి కాలం గత ఏడాది చివ రిలోనే ముగిసింది. అప్పటి నుంచి కేపీసీసీ నూతన సారథి ఎంపిక వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూనే ఉంది. అయితే మొదటి నుంచి ఆ పదవి వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన వారికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అది కుదరని పక్షంలో లింగాయత్ వర్గానికే చెందిన ఎస్.ఆర్ పాటిల్ లేదా అప్పాజీనాడగౌడకు ఆ పదవి దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే వీరికి రాష్ట్ర రాజకీయాల్లో ‘నెమ్మదస్తులైన నాయకులుగా’ పేరుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్రశాఖకు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్ప సారథ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్.ఆర్ పాటిల్ లేదా అప్పాజీనాడగౌడకు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్నను ఆ పార్టీ నాయకులే వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కేపీసీసీ అధ్యక్ష పదవి అటు వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తికి ఇటు లింగాయత్ సముదాయానికి కాకండా రాష్ర్ట రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషించే మరో సముదాయమై ఒక్కలిగ సముదాయానికి చెందిన నాయకుడికి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే జరిగితే ప్రస్తుత ఇంధన శాఖ మంత్రి డీ.కే శివకుమార్‌కు కేపీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. త్వరలో జరిగే మంత్రివర్గ పునఃరచనలో కూడా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్, ఒక్కలిగ సముదాయాలకే పెద్ద పీఠ వేయాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
జేడీఎస్ నాయకుల చూపు బీజేపీ వైపు...
రాష్ట్రంలో జేడీఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో జరిగిన బీబీఎంపీ, జిల్లా, తాలూకా పంచాయతీ అధ్యక్ష తదితర అన్నికల్లో జేడీఎస్ నిర్ణయాత్మక పాత్ర మాత్రమే పోషించింది తప్పిస్తే ఒక ఎన్నికలో కూడా అధికారాన్ని చేపట్టలేదు. దీంతో ఆ పార్టీ నాయకులు మాటలకు విలువ లేకుండా పోతోంది. దీంతో ఆ పార్టీలోని నాయకులు రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పడే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయినట్లు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, జిల్లా, తాలూకా పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టింది. మరోవైపు మాస్ లీడర్‌గా పేరొందిన యడ్యూరప్ప ఆ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీ నుంచి ఎవరు వచ్చినా బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయని యడ్డీతో పాటు మండలి విపక్ష నేత కే.ఎస్ ఈశ్వరప్ప బహిరంగంగానే పేర్కొన్నారు. దీంతో దళం నాయకులు మఖ్యంగా పాత మైసూరు ప్రాంతానికి చెందిన వారు బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.
బీజేపీలోనూ...ప్రస్తుతం శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా లింగాయత్ సముదాయానికి చెందిన జగదీష్‌శెట్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా అదే సమాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని చేపట్టారు. ఇలా ముఖ్యమైన పదవులన్నీ ఒకే వర్గానికి చెందిన వారికి కేటాయించడం సరికాదని కమల నాయకులు భావిస్తున్నారు. దీంతో శాసనసభ ప్రతిపక్ష నాయకుడి పదవిని రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర చూపిస్తున్న మరో వర్గానికి కట్టబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ఈతరుణంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోనే కాకుండా స్వపక్షంలోనూ రాజకీయ సమీకరణలు మారుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
యడ్డి తొలి సమావేశం..
ఇదిలా ఉంటే యడ్యూరప్ప ఆదివారం నగరంలోని పార్టీ ప్రధాన కార్యాయంలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లతో పాటు ఇతర ప్రధాన నాయకులతో సమావేశమై ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. యడ్యూరప్ప అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత నిర్వహించిన మొదటి సమావేశం ఇదే. ఇదిలా ఉంటే ఈనెల 14న ప్యాలెస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం నిర్వహించే బృహత్ సమావేశాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని తీర్మానించారు.