బాధిత కుటుంబానికి రూ.5 వేలు
గుడిసెకు పది వేలు
హెక్టారుకు రూ.13-18 వేలు
ప్రకటించిన సీఎం జయలలిత
చెన్నై: ఎట్టకేలకు సీఎం జయలలిత వరద సాయాన్ని ప్రకటించారు. గుడిసె వాసులకు రూ.10 వేలు, సొంత ఇళ్లలోని వరద బాధితులకు రూ.5 వేలు చొప్పున సాయం అందించనున్నారు. పంటల్ని కోల్పోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకు అందించనున్నారు.
ఈశాన్య రుతు పవనాలు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్ని అతలాకుతలం చేశాయి. లక్షలాది కుటుంబాలు కష్టాల కడలిలో మునిగాయి. ఇతర జిల్లాల్లోనూ వర్షం ప్రభావం ఓ మోస్తరే. తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లోని బాధితులకు ఏ మేరకు సీఎం జయలలిత సాయం ప్రకటిస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి.
అదే సమయంలో వరద సాయంపై ఎలాంటి ప్రకటన చేయక పోవడంతో విమర్శలు బయల్దేరాయి. ఎట్టకేలకు స్పందించిన సీఎం జయలలిత సోమవారం సచివాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన అనంతరం వర్షాల నుంచి ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని కాంక్షిస్తూ, ఆరోగ్య సూత్రాలతో కూడిన ఓ ప్రకటనను తొలుత వెలువరించారు.
తదుపరి వరద సాయం ప్రకటిస్తూ మరో ప్రకటన చేశారు. వరద బాధితుల వివరాలను త్వరితగతిన సేకరించాలని, నష్టం తీవ్రతపై నివేదికను త్వరితగతిన సిద్ధం చేసి సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు.
వరద సాయం: వరదలతో గుడిసెల్ని కోల్పోయిన కుటుంబాలకు రూ.10 వేలు ప్రకటించారు. ఇతర బాధితుల కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున వరద సాయం అందించనున్నారు. ఈ సాయంతో పాటుగా గుడిసెవాసులకు పది కేజీల బియ్యం, ఇతరులకు ఐదు కేజీల బియ్యం, దుప్పటి, చీర, దోవతి అందించనున్నారు. కూవం నదీ తీరం వెంబడి ఉన్న గుడిసెవాసులకు ప్రత్యామ్నాయంగా గృహాల కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు.
ఒక్కియం తురై పాక్కంలో నిర్మిస్తున్న పది వేల గృహాలను వారికి అప్పగించేందుకు నిర్ణయించారు. వరదలతో కోల్పోయిన కుటుంబ, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు, లెసైన్స్‌లు, ఇంటి పట్టాలు తదితర అన్ని రకాల కార్డులు, సర్టిఫికెట్లను మళ్లీ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం ఈ నెల 14వ తేదీ నుంచి రెండు వారాల పాటుగా వరద బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రభుత్వ సేవా కేంద్రాల ద్వారా కూడా నకళ్లను పొందవచ్చని సూచించారు.
వరద సాయం బాధితులకు బ్యాంక్ ఖాతాల ద్వారా అందుతున్నాయని ప్రకటించారు. రాత్రనక పగలనక చెన్నైలో పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన కార్మికులకు ప్రత్యేకంగా తలా రూ.2 వేలు ప్రకటించారు. ఇక, అన్నదాతల్ని ఆదుకుంటున్నామంటూ వరదలతో పంట పరిహారం అందజేయనున్నట్టు వివరించారు. సాగుబడులు, భూ సారం ఆధారంగా కొన్ని పంటలకు హెక్టారుకు రూ.7500, మరికొన్ని పంటలకు రూ.13,500, ఇంకొన్ని పంటలకు రూ. 18 వేలు చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.
సహకార బ్యాంక్‌ల ద్వారా ఈ రుణాలను అందిస్తామని, అయితే, రైతుల అప్పులతో ఈ రుణాలు జమ చేసిన పక్షంలో తీవ్ర చర్యలు తప్పదని బ్యాంక్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, వరదలతో మరణించిన పశువులకు రూ.30 వేలు, మేకలకు రూ.3 వేలు, కోళ్లకు రూ.100 చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నామన్నారు. మరో ప్రకటనలో వరద సాయం గురించి వివరిస్తూ, 13.80 లక్షల మందిని రక్షించామని తెలిపారు. వారిని యాభై వేల శిబిరాల్లో ఉంచి, సహాయకాలను అందిస్తున్నామని వివరించారు.