మెరీనా తీరంలో మారథాన్
Published Mon, Dec 2 2013 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
ఆదివారం వేకువజామున 5 గంట లకు చెన్నైలోని మెరీనా తీరానికి సుమారు 10వేల మందికి పైగా చేరుకున్నారు. చలి వణికిస్తున్నా, వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా 42 కిలోమీటర్ల దూరం పరుగు తీశారు. దేశవిదేశాలకు చెందిన యువకులు ఈ మారథాన్‌లో పాల్గొంటే ఉగాండాకు చెందిన యువకుడు రెండో సారి విజేతగా నిలిచాడు.
కొరుక్కుపేట, న్యూస్‌లైన్:విప్రో-చెన్నై మారథాన్ - 2013కు అనూహ్య స్పందన లభించింది. విప్రో సంస్థ, చెన్నై రన్నర్స్ సంయుక్త ఆధ్వర్యంలో రెండో సీజన్ మారథాన్‌ను ఆదివారం నిర్వహించారు. చెన్నై మెరీనా తీరాన ఉదయం 5 గంటలకు ప్రారంభమైన మారథాన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన యువకులు కూడా పాల్గొన్నారు. దాదాపు 10వేల మంది ఈ రన్‌లో పాల్గొని వర్షం వచ్చినా, లెక్కచేయకుండా మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించారు. పుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రన్‌ను నిర్వహించారు. ఫుల్‌మారథాన్‌ను చెన్నై రన్నర్ మారథాన్ అయిన బాస్కో ప్రారంభించగా,
హాఫ్ మారథాన్‌ను చెన్నై రన్నర్ ఫౌండర్ రామ్ విశ్వనాథన్, 10 కిలోమీటర్ల రన్‌ను టీఎన్‌ఏఏ సెక్రటరీ, ఏడీజీపీ రాజేంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఫుల్ మారథాన్‌లో 42.2 కిలోమీటర్ల దూరం రెండు గంటల 32 నిమిషాల 21 సెకన్లలో పరుగు తీసి ఉగాండా దేశానికి చెందిన ఇస్మాయిల్ పురుషుల విభాగంలో మొదటి స్థానం పొందారు. మహిళల విభాగంలో ఫుల్ మారథాన్‌లో సుధామణి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. మొదటి సీజన్‌లో ఫుల్ మారథాన్ విజేత ఇస్మాయిల్ రెండో సీజన్‌లోనూ మొదటి బహుమతి గెలుచుకోవటం గమనార్హం. విజేతలుగా నిలిచిన వారికి ఫుల్ మారథాన్‌లో రూ.35,000 ప్రథమ, రూ.25,000 ద్వితీయ, 15,000 తృతీయ బహుమతులుగా అందచేశారు. హాఫ్ మారథాన్‌లో రూ.25,000, రూ.15,000, రూ.10,000 చొప్పున అందచేశారు కల నిజమైంది : రెండో సీజన్‌లోనూ విజేతగా నిలవాలన్న నా కల నిజమైంది. పోటీ ఎక్కువగా ఉన్నా, వర్షం అడ్డు వచ్చినా గెలవాలన్న తపన నన్ను విజేతగా నిలిపింది. చెన్నై మారథాన్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది - ఇస్మాయిల్, ఉగాండా
Advertisement