‘చిదంబర’ రహస్యం
►నటరాజస్వామి స్వయంగా రాసిన తాళపత్రాలపై చర్చ
►పుదుచ్చేరి మఠం నుంచి స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి పట్టు
►విచారణ జరిపిస్తామని దేవాదాయ మంత్రి సేవూరు రాజేంద్రన్ వెల్లడి
చెన్నై: దేవుడు ఉన్నాడు అంటారు ఎందరో, లేడు అంటారు మరికొందరు. ఉంటే బాగుండేదని బాధపడుతుంటారు కొంతమంది. అయితే ప్రస్తుత చర్చనీయాంశంగా మారిన విషయం వీటన్నింటి కంటే ఒక అడుగు మించింది. చిదంబరం నటరాజస్వామి స్వయంగా రాసినట్లుగా భావిస్తున్న తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయి, పుదుచ్చేరి పీఠంలో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజమేనా, స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా అనే అంశాలు చిదంబర రహస్యంగా మారాయి.
చిదంబరం నటరాజస్వామి ఆలయానికి మనిషి రూపంలో దేవదేవుడే వచ్చి తాళపత్రాలలో తిరువాచక గీతాలను రాసి ఆలయానికి అప్పగించారని భక్తుల విశ్వాసం. ఈ తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరిలోని అంబలత్తాడి మఠంలో ఉన్నట్లు సమాచారం. ఆ తాళపత్రాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో కొత్త చర్చ బయలుదేరింది.
ఈ చర్చను లేవనెత్తింది వేరెవరో కాదు తమిళనాడు ప్రభుత్వ దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి వీవీ స్వామినాథన్. నటరాజ పెరుమాళ్ స్వయంగా రాసిన ఆ తాళపత్రాలు చిదంబరం ఆలయ సొత్తు కావడంతో దానిని స్వాధీనం చేసుకోవాలంటూ ఆలయ నిర్వాహకులకు, కడలూరు జిల్లా కలెక్టర్, దేవదాయశాఖ, విగ్రహాల అక్రమరవాణా నిరోధక శాఖ, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు స్వామినాథన్ ఇటీవల లేఖ రాశారు. ఈ ఉత్తరంపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ కిరణ్‌బేడీ పోలీస్‌శాఖను ఆదేశించారు.
పురాణం ఏమీ చెబుతోందంటే..
శివ క్షేత్రాలను దర్శించుకుంటూ చిదంబరం నటరాజస్వామి ఆలయానికి వచ్చిన మాణిక్యవాచకర్ అనే మహాభక్తుడు అక్కడి శివుడిని దర్శించుకున్న తరువాత అదే ఊరిలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ నివాసానికి ఒక వృద్ధుడు వచ్చి శివపెరుమాళ్ ఆజ్ఞతో తాను ఇక్కడికి చేరుకున్నానని పరిచయం చేసుకుని మాణిక్యవాసగర్ భక్తిని మెచ్చుకున్నాడు. వృద్ధుని కోర్కె మేరకు శివపెరుమాళ్ గురించి మాణిక్యవాసగర్ భక్తి పాటలు ఆలపించాడు. ఆయన ఆలపించిన 400 గీతాలను వృద్ధుడు తాటాకు పత్రాలపై రాసి తనతోపాటు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఆలయాన్ని తెరిచిన అర్చకుడు అక్కడి మెట్లపై ఉన్న తాళపత్రాలను చూసి ఊరిపెద్దలకు సమాచారం ఇచ్చాడు. ఆ తాళపత్రాల్లో తిరువాసగ శ్లోకాలు, తిరుక్కోవయార్ రచించిన 400 శ్లోకాలు కూడా చోటుచేసుకున్నాయి. ఊరిపెద్దలంతా కలిసి తిరువాచగర్‌ను ఆలయానికి పిలిపించగా తాళపత్రాల్లోని పాటలను ఆలపించాడు.
నా గీతాల్లోని భావాలకు మూలకర్త నట రాజస్వామినే అని చెబుతూ స్వామి వారిలో మాణిక్యవాచగర్ ఐక్యమైపోయాడు. నటరాజర్ స్వయంగా రాసినట్లు భావిస్తున్న సదరు తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరి అంబలతావడి మఠం స్వాధీనంలో ఉన్నట్లు సమాచారం. మాణిక్యవాచగర్ పాడుతుండగా సాక్షాత్తు నటరాజస్వామినే తాళపత్రాల్లో రాశాడని మాజీ మంత్రి స్వామినాథన్ అంటున్నారు. చిదంబరంలోని ఆరుముగనావలర్ స్కూల్‌లో ఈ తాళపత్రాలను ప్రదర్శనగా ఉంచినపుడు తాను చూసి ఉన్నానని చెప్పారు.
ఈ తాళపత్రాలను తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్వాధీ నం చేసుకుని తగిన భద్రతతో భక్తుల సందర్శనకు ఉంచాలని ఆయన కో రారు. అంబలత్తాడి మఠంలో నట రాజ స్వామి పాదాలకు సమీపంలో సుమారు ఒకటిన్నర అడుగు వెడల్పు, ఒక అడుగు ఎత్తు ఉన్న వెండి పీట ఉంది. ఈ పీటలోనే తాళపత్రాలు ఉన్నట్లుగా అంబలత్తాడి మఠం 33వ మఠాధిపతి కనకసభాపతి స్వామి చెబుతున్నారు. పూర్తిగా సీల్ వేసినట్లుగా ఉన్న పీటను ఏ కారణం చేత కూడా విప్పిచూడడం, పరిశోధన చేయడమో కూడదని తమ పూర్వీకులు సూచించినట్లు స్వామి తెలి పారు. మాస శివరాత్రి రోజుల్లో రాత్రి 11 గంటల సమయంలో వెండి పీటను కేవలం ఒక గంటపాటు భక్తుల సందర్శనార్థం ఉంచుతున్నామని స్వామి చెప్పారు.
350 ఏళ్ల కిత్రం జరిగిన కర్ణాటక యుద్ధం సమయంలో చిదంబరం మఠంలోని నటరాజస్వామి విగ్రహం, తాళపత్రాలు వస్తువులను పుదుచ్చేరి మఠంలో భద్రపరిచినట్లు స్థలపురాణంలో పేర్కొన్నారు. పుదుచ్చేరి మఠంలోని తాళపత్రాలు మాణిక్యవాసగర్ కాలం నాటివేనని అక్కడి అర్చకులు అంగీకరిస్తున్నారు. ఈ తాళపత్రాల నకళ్లు మయిలాడుదురై, చిదంబరం ఆలయాల్లో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. తాళపత్రాల వ్యవహారంపై చిదంబరం ఆలయ దీక్షితులు ఉమానా«థ్ మాట్లాడుతూ నటరాజస్వామి స్వయంగా రాసినట్టు చెపుతున్న తాళపత్రాలు తమ ఆలయానికి చెంది నవి అని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవు, అందుకే ఆలయ నిర్వాహకులు వాటిని స్వాధీనం చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని అన్నారు.
విచారణ జరిపిస్తాం
తాళపత్రాల విషయం ఇటీవల తన దృష్టికి వచ్చిందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి సేవూరు రామచంద్రన్ ఇటీవల మీడియాతో అన్నారు. తాళపత్రాలు నటరాజస్వామి ఆలయానికి చెందినవి అనే వాదనపై అధికారుల పూర్తిస్తాయి విచారణ జరిపిస్తానని అన్నారు. విచారణపై నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు....సేవూరు రామచంద్రన్