సర్కారు వారి పాట పది లక్షల కోట్లు | CII seminar deals in Visakhapatnam | Sakshi
Sakshi News home page

సర్కారు వారి పాట పది లక్షల కోట్లు

Published Sun, Jan 29 2017 1:21 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

సర్కారు వారి పాట పది లక్షల కోట్లు - Sakshi

సర్కారు వారి పాట పది లక్షల కోట్లు

విశాఖ సీఐఐ సదస్సులో ఒప్పందాలు
అందులో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే
కేంద్ర పథకమైన గ్రామీణ విద్యుదీకరణకూ ఒప్పందం
టెండర్లు ఖరారైన జెన్‌కో సోలార్‌ కేంద్రంపై మళ్లీ ఎంవోయూ
అమరావతి అభివృద్ధి పనులు కూడా సదస్సు ఖాతాలోనే
జాతీయ రహదారులు, రింగురోడ్లపై కూడా ఒప్పందాలు
సదస్సులో కంటికి కనిపించని విదేశీ కంపెనీలు
కన్నెత్తయినా చూడని అంబానీ, అదానీ సంస్థలు
సామర్థ్యం లేని సంస్థలతోనూ రూ.కోట్లకు ఒప్పందాలు
సంతకాలకు నిరాకరించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి


విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో 665 ఒప్పందాలు జరిగాయని, వీటి విలువ రూ.10,54,590 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 22,34,096 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే ఈ ఒప్పందాల్లో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే జరగడం, ఈ ఏడాది సదస్సులో విదేశీ సంస్థలేవీ కనిపించకపోవడం, ఒప్పందాలు చేసుకున్న ప్రైవేటు సంస్థలేవీ పెద్దవి కాకపోవడంతో ఒప్పందాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రిఫైనరీలో, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామని పదేళ్లుగా చెబుతున్న కేంద్రప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీలతో ఈ ఏడాది భారీ ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పదేళ్లుగా పెట్టుబడులు పెట్టని సంస్థలు ఈ ఏడాది ఎలా పెడతాయని పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఇప్పటికే టెండర్లు ఖారైన ఏపీ జెన్‌కో సోలార్‌ విద్యుత్‌ కేంద్రానికి కొత్తగా ఎంవోయూ చేసుకున్నట్లు చూపించారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన రెండు రింగు రోడ్లను కూడా ఒప్పందాల్లో చూపించడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని కూడా ఎంవోయూల్లో చూపించడంతో రూ.లక్షల కోట్ల ఒప్పందాల్లో నిజమైనవి ఎన్ని అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 91 ఎంవోయూలు చేసుకున్న పరిశ్రమల శాఖ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆ శాఖ కార్యదర్శి సాల్మన్‌ అలోఖ్యా రాజ్‌ తిరస్కరించడం సదస్సు జరిగిన, జరిపిన తీరుకు అద్దం పడుతోంది. సదస్సుకు ముందే ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్ళి పలు కంపెనీలను సదస్సుకు ఆహ్వానించినా స్పందన కనిపించలేదు. దీంతో ప్రతిష్ట దెబ్బతింటోందని గుర్తించిన ప్రభుత్వం తన సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రుల చేత ఒత్తిడి తెప్పించి, వారి శాఖల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నట్టు ఒప్పందాలు చేసుకుందని తెలుస్తోంది.

ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, ఆర్‌ఈసీ... ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు ఇందులో భాగమేనని సమాచారం. రాష్ట్రానికి ఇప్పటికే వివిధ పథకాల కింద ఇచ్చామని కేంద్రం చెబుతున్న రూ.రెండు లక్షల కోట్లనూ ఈ ఒప్పందాల్లో కలిపేశారు. ఇలాంటి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి పనికి వస్తాయే తప్ప రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడవని పారిశ్రామిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులను కూడా ఎంవోయూల్లో చూపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా ఈ ఒప్పందాల్లో కలిపేసి ఉంటే ఇంకా భారీగా కనిపించి ఉండేదని ఎద్దేవా చేస్తున్నారు.

గత ఏడాదీ ఇదే ఆర్భాటం.. ఫలితం శూన్యం...
గత ఏడాది నిర్వహించిన సదస్సులో కూడా 331 సంస్థలతో ఎంవోయూలు కుదిరాయని, రూ. 4.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఆర్భాటంగా ప్రకటించింది. ఏడాది గడిచినా ఒక్క ఒప్పందమూ వాస్తవరూపం దాల్చలేదు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో 228 కంపెనీలు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమా రాలేదని, ఏ ఒక్కరికీ ఉపాధి లభించలేదని ప్రభుత్వమే సమాచార హక్కు చట్టం ద్వారా మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు అందించిన వివరాల్లో పేర్కొంది. కేవలం రూ.5,980 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు గణతంత్ర దినోత్సవంనాడు గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.రెండు లక్షల కోట్లకు పైనే వచ్చేశాయని పదే పదే చెప్పడమే కాకుండా తాజాగా విశాఖ సదస్సులో కూడా ప్రకటించారు. గత ఏడాది సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆదానీ, అంబానీ, చైనా, జపాన్‌ కంపెనీల నుంచి కనీసం ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. ఈ ఏడాది సదస్సులో ఆ కంపెనీల జాడ కానరాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వాస్తవాలను దాచిపెట్టి రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని మభ్యపెట్టే ప్రయత్నాలు  చేస్తూనే ఉంది. విదేశీ పర్యటనలు, పారిశ్రామిక సదస్సుల పేరిట రూ.కోట్లు వెచ్చిస్తూనే ఉంది. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులనే కొత్తగా వచ్చినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తోంది. సామర్థ్యంలేని సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని అరచేతిలో స్వర్గం చూపిస్తోంది.

పాత వాటికే కొత్త రంగు
విశాఖ సదస్సులో జరిగిన ఎంవోయూల జాబితాలో సింహభాగం ఇంధన, మౌలిక వసతుల పెట్టుబడులనే చేర్చారు. వీటిల్లో చాలావరకూ ఇప్పటికే ఉన్నాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధం లేనివి. ఇంకొన్ని పట్టుమని వందమందికి కూడా ఉపాధి చూపలేని పరిశ్రమలు కావడం గమనార్హం.

► అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఏపీజెన్‌కో 500 మెగావాట్లతో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు ఏడాది కిందటే పిలిచారు. అప్పట్లో టెండర్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీటిని రద్దు చేసి, మళ్ళీ గత నెల ఖరారు చేశారు. దీన్ని కొత్తగా తీసుకొచ్చినట్టు పేర్కొంటూ సదస్సులో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది.
► గ్రామీణ విద్యుదీకరణ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. గడచిన రెండేళ్ళుగా ఇది అన్ని రాష్ట్రాల్లోనూ నడుస్తోంది. తాజాగా మళ్ళీ ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్, ఈపీడీసీఎల్‌ మధ్య ఒప్పందం చేసుకున్నారు. వాస్తవానికి ఈఈఎస్‌ఎల్‌ పెట్టుబడి ఇందులో ఉన్నప్పటికీ, ప్రతీ పైసా విద్యుత్‌ చార్జీల రూపంలో ప్రజలే చెల్లించాలి. ఇది పెట్టుబడి ఎలా అవుతుందో సర్కారుకే తెలియాలి. 
► కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ గత పదేళ్ళుగా రాష్ట్రంలో రిఫైనరీలు, పెట్రో కెమికల్‌ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తామని చెబుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటివరకూ ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. తాజాగా కాకినాడలో రిఫైనరీ, కాంప్లెక్స్‌ పెడతామని ఎంవోయూ చేసుకుంది. గత ఏడాది విశాఖపట్టణంలో రిఫైనరీ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ లేకపోవడం గమనార్హం. హా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర, పవన విద్యుత్‌ కేంద్రాలకు సంబంధించిన ఎంవోయూలు చేసుకున్నారు. వాస్తవానికి ఆ కంపెనీలు ఏమేర ఉత్పత్తి చేస్తాయి? వాటిని ఎలా వాడుకుంటారు? అనే విషయాలను ఏపీఈఆర్‌సీ పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ఇవేవీ లేకుండానే ఊరు పేరు లేని కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు.
► గన్నవరం రన్‌వే విస్తరణ, కొత్త టర్మినల్‌కు సంబంధించిన శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు గత నెలలోనే జరిగాయి. దీన్ని కూడా కొత్త ఎంవోయూగా చూపించి,  దీని ద్వారా రూ.780 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
► రాష్ట్రవ్యాప్తంగా మినీ థియేటర్లను ఏర్పాటు చేస్తామని ఒక కంపెనీ ముందుకొచ్చింది. జిల్లాకు రూ.25 కోట్లు వెచ్చి స్తామని తెలిపింది. ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు, తాము ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలమని, ఎంవోయూ అయిన తర్వాత ప్రతీ జిల్లాలోనూ వేరెవరి ద్వారానైనా పెట్టు బడులు తెస్తామని తెలిపారు. ఈ సంస్థ కూడా ఎంవోయూల జాబితాలో ఉంది.
► విజయవాడలో చిన్న తరహా త్రీడీ ప్రింటింగ్‌ కంపెనీ రూ.కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ఎంవోయూ సందర్భంగా ప్రభుత్వం చెప్పడం గమనార్హం.

సంతకాలకు నిరాకరించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి
పరిశ్రమల శాఖ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆ శాఖ కార్యదర్శి సాల్మన్‌ అలోఖ్యా రాజ్‌ తిరస్కరించడం పరిశ్రమల వర్గాలను విస్మయ పరిచింది. విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సులో పరిశ్రమల శాఖ 91 ఎంవోయూలు చేసుకుంది. ప్రతీశాఖలోనూ ప్రభుత్వం తరపున ఆ శాఖ కార్యదర్శులే సంతకాలు పెట్టారు. ఇదే విధంగా సాల్మన్‌ను కూడా సంతకాలు పెట్టాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. ఎంవోయూలన్నీ కేపీఎంజీ ఎంపిక చేసినవే కావడం, వీటికి ఎంతమాత్రం విశ్వసనీయత లేదని ఆయన గుర్తించడం వల్లే సంతకాలు చేసేందుకు వెనుకాడినట్టు సమాచారం. కార్యదర్శి ఇష్టపడకపోవడంతో పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో ఎంవోయూలపై సంతకాలు చేయించారు. ఈ విషయమై సాల్మన్‌రాజును ‘సాక్షి’ వివరణ కోరగా... ఎంవోయూలపై మిశ్రా సంతకాలు పెడతారని, తనతో పనేమిటని అనడం గమనార్హం.

ఎక్కడబడితే అక్కడే ఎంవోయూలు!
పెట్టుబడుల ఒప్పందం చేసుకునే సంస్థల ఆర్థిక పరిస్థితిని ముందుగా గమనించాలి. వాటి విశ్వసనీయతను గుర్తించిన తర్వాత ఎంవోయూలకు సిద్ధపడాలి. కానీ ఈ తరహా కసరత్తు జరిగినట్టు ఎక్కడా కన్పించలేదు. అసలు ఎంవోయూలు చేసుకునే పరిశ్రమలను భారత పరిశ్రమల సమాఖ్య, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తీసుకురావడం గమనార్హం. సీఐఐ పిలిచింది కాబట్టే తాము వచ్చామని సోలార్‌ ఎనర్జీలో ఎంవోయూ చేసుకున్న ఓ పారిశ్రామిక వేత్త అన్నారు. నిజానికి రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం కూడా ఈ సంస్థకు లేదు. మరోవైపు ఎంవోయూలు జరిగిన తీరు చాలా విడ్డూరంగా ఉంది. హాల్‌లో... నేలపై... ఆరుబయట.... ఇలా ఎక్కడబడితే అక్కడే ఎంవోయూలు చేసుకున్నారు. అధికారులు వాటిని పూర్తిగా పరిశీలించిన పాపాన కూడా పోలేదు. వెయిటింగ్‌ హాల్‌లో కొన్ని సంస్థలకు చెందిన ఎంవోయూ పత్రాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సోలార్‌ కార్పొరేషన్, నెడ్‌క్యాప్‌ అధికారులు వాటిని కుదుర్చుకున్నట్టే భావించి సంతకాలు పెట్టి మమ అన్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement