వ్యవసాయా అధికారి ముత్తుకుమార స్వామి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అగ్రికృష్ణమూర్తికి ఊరట లభించింది.
సాక్షి, చెన్నై : వ్యవసాయా అధికారి ముత్తుకుమార స్వామి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అగ్రికృష్ణమూర్తికి ఊరట లభించింది. ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చే విధంగా కేసును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. తిరునల్వేలికి చెందిన వ్యవసాయ శాఖ ఇంజనీరింగ్ అధికారి ముత్తుకుమార స్వామి గతంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అగ్రి కృష్ణమూర్తి, ప్రధాన ఇంజనీరింగ్ అధికారి సెంథిల్ వేధింపులతోనే ముత్తుకుమార స్వామి బలవన్మరణానికి పాల్పడ్డట్టు ఆరోపణలు బయలు దేరాయి. దీంతో అగ్రి పదవి కాస్త ఊడింది. ఈ కేసులో అరెస్టయి జైలు జీవితం సైతం అనుభవించాల్సిన పరిస్థితి అగ్రి కృష్ణమూర్తికి ఏర్పడింది. అదే సమయంలో కేసులో ప్రధాన సాక్షిగా భావిస్తున్న అగ్రి మాజీ అసిస్టెంట్ రవికుమార్ ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది. దీంతో విచారణను సీబీసీఐడీకి అప్పగించారు. ఏడాదికి పైగా విచారణ సాగుతూ వస్తున్న సమయంలో ఇటీవల బెయిల్ మీద అగ్రి బయటకు వచ్చారు.
క్లీన్ చిట్ : బెయిల్ మీద బయటకు వచ్చినానంతరం అగ్రి కృష్ణమూర్తి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంను ఆశ్రయించారు. తన మీద ఆధార రహిత ఆరోపణలతో కేసు నమోదైందని, తాను ఇందులో నిర్దోషినంటూ పిటిషన్‌లో వివరించారు. తనను ఈ కేసులో ఇరికించారని, ఈ కేసును రద్దుచేయాలని కోరారు. ఈ పిటిషన్ విచారణ మదురై ధర్మాసనం న్యాయమూర్తి వీఎస్ రవి నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణ జరుగుతోంది. మంగళవారం విచారణ ముగింపు దశకు చేరింది. పిటిషనర్ అగ్రి తరఫున న్యాయవాదులు రమేష్, షణ్ముగరాజ్, సేతుపతిలు తమ వాదనల్ని విన్పించారు.
ఆధార రహిత కేసుల్ని రద్దు చేయాలని వాదన విన్పించగా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే, అగ్రి లంచం తీసుకునే విధంగా ఒత్తిడి తెచ్చినట్టు, ఉమ్మడిగా, పథకం ప్రకారం వేధించినట్టుగా, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా ఆధారాలు లేని దృష్ట్యా, ఈ కేసును రద్దు చేస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో వ్యవసాయ అధికారి ముత్తుకుమార స్వామి ఆత్మహత్య కేసు నుంచి అగ్రికి ఊరట లభించినట్టు అయింది. తనకు క్లీన్ చిట్ ఇచ్చే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ‘అమ్మ’ ప్రసన్నంతో మళ్లీ అన్నాడీఎంకేలో తన సేవల్ని అందించేందుకు తగ్గ కార్యాచరణలో అగ్రి మునిగి ఉన్నారు.ఎన్నికల్లో తనకు మళ్లీ సీటు దక్కుతుందా..? అన్న ఆశతో ఎదురు చూపుల్లో పడ్డారు.