
సమీక్షలకు శ్రీకారం
► సీఎం బిజీ
►మంత్రులతో చర్చ
► అసెంబ్లీకి సన్నద్ధం
అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీగా సమీక్షలకు సీఎం పళనిస్వామి సిద్ధం అయ్యా రు. సోమవారం పర్యాటక, దేవాదాయ, ప్రజా పనుల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులతో
భేటీ అయ్యారు.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలు జూన్ ఏడు లేదా ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేను ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో పాలకులు నిమగ్నం అయ్యారు. శాఖల వారీగా కేటాయింపులు, పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించి పనిలో పడ్డారు. ఉదయం సచివాలయంకు దాదాపుగా అందరూ మంత్రులు హాజరయ్యారు. వారి వారి శాఖల్లో సమీక్షలతో బిజీ అయ్యారు. ఆయా శాఖల్లోని వ్యవహారాల మీద సీఎం పళనిస్వామి సైతం దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోజుకు రెండు మూడు శాఖలు చొప్పున సమీక్షించేందుకు నిర్ణయించారు.
ఆ దిశగా దేవాదాయ, పర్యాటక, ప్రజా పనుల శాఖల్లో సాగుతున్న పనులు, నిధులు, వ్యయాలు, పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఆయా శాఖల మంత్రుల సమక్షంలో కార్యదర్శులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఆయా శాఖల మీద చర్చ సాగే సమయంలో ప్రతిపక్షాల్ని ఎదుర్కొనే విధంగా అన్ని సమాధానాలు, అన్ని వివరాలు లెక్కలతో సహా ముందు ఉంచుకుని తిప్పికొట్టే ప్రసంగాలు సాగించాలని ఈ సందర్భంగా సీఎం ఆయా శాఖల మంత్రులకు సూచించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీఎం పళని స్వామిని కలిసి వినతి పత్రం సమర్పించడం గమనార్హం.
సీఎంతో భేటీ: పళని స్వామి సర్కారుకు వ్యతిరేకంగా పన్నెండు మంది ఎమ్మెల్యే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మాజీ మంత్రులు పళనియప్పన్, సెంథిల్ బాలాజీ, తోపు వెంకటాచలం కూడా ఉన్నారు. వీరితో పాటుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉదయం సచివాలయం వచ్చారు. సమీక్షలో బిజీగా ఉన్న సీఎంను కలిసేందుకు యత్నించారు. సమీక్ష ముగిసినానంతరం వీరికి అనుమతి లభించిందని చెప్పవచ్చు. సీఎంతో ఈ ఎనిమిది మంది గంట పాటుగా సమావేశం అయ్యారు.
నియోజకవర్గాల్లోని సమస్యలు, కూవత్తూరు క్యాంపులో తమకు ఇచ్చిన హామీల అమలు నినాదంతో ఓ చిట్టాను సీఎంకు అందజేసి వెళ్లినట్టు సమాచారం. దీంతో సీనియర్ మంత్రులు సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, ఎస్పీ వేలుమణిలను తన ఛాంబర్‌కు సీఎం పిలిపించుకుని ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన జాబితాను పరిశీలించి, వాటి అమలు మీద తగు నిర్ణయం తీసుకునే పనిలో సీఎం నిమగ్నమైనట్టు తెలిసింది.
అమ్మ ప్రభుత్వానికి నేటితో ఏడాది : పాలన మీద పట్టు బిగించే విధంగా , ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే రీతిలో పళని సర్కారు సిద్ధం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారంతో అమ్మ ప్రభుత్వం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కానున్నడం గమనార్హం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అమ్మ జయలలితకు మళ్లీ పట్టం కట్టారు. మే 23వ తేది వరుసగా రెండో సారి సీఎం పగ్గాలు జయలలిత చేపట్టారు.
ఈ ఏడాది కాలంలో ఎన్నో విషాదాలు, ఎన్నో ఘటనలు సాగినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అమ్మ జయలలిత మరణంతో పన్నీరు సీఎం కావడం, ఆయన్ను పదవి నుంచి దించి చిన్నమ్మ శశికళ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేపట్టి, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పళని తన నేతృత్వంలో అమ్మ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రమే.
ఢిల్లీకి సీఎం : ముఖ్యమంత్రి పళణిస్వామి మంగళవారం ఢిల్లీ బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం భేటి కానున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధానితో రెండు రోజుల క్రితం భేటి అయిన నేపథ్యంలో హఠాత్తుగా సీఎం ఢిల్లీ పర్యటన సాగునుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.