
అతిథి పాత్రలో సీఎం..
బెంగళూరు: రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడప్పుడు ఆటవిడుపుగా సినిమాలు చూస్తుంటారు. ఈసారి రాజకీయాల నుంచి ఉపశమనం పొందేందుకు కొత్తగా తెరకెక్కుతున్న కన్నడ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. కవితా లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సమ్మర్ హాలిడేస్ అనే చిన్న పిల్లల చిత్రంలో సీఎం పది నిమిషాల నిడివి కలిగిన అతిథి పాత్రకు అంగీకరించారు. గిరిజనుల సమస్యలపై ఉద్యమాలు చేసే పిల్లలకు సహాయం చేసే ముఖ్యమంత్రి పాత్రలో సిద్ధారామయ్య కనిపించనుండడం విశేషం.
అదే విధంగా కన్నడ సినీ నటుడు రమేశ్ నేతృత్వంలో ఓ ప్రైవేటు కన్నడ ఛానల్‌లో ప్రసారమవుతున్న వీకెండ్ విత్ రమేశ్ కార్యక్రమంలో కూడా సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరంలో అబ్బయ్య నాయుడు స్టూడియోలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు షూటింగ్ సాగింది. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కే.జే. జార్జ్ సీఎంతో పాటు స్టూడియోకు వచ్చారు. ఈ సందర్భంగా స్టూడియో చుట్టుపక్కల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.