
ఆ ఐపీఎస్‌ల మధ్య చిచ్చు
కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. ఉన్నత పదవుల కోసం సహచరులపైనే పరోక్షంగా కక్ష సాధింపులకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్ కేసు రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ విషయంపై గురువారం సాయంత్రం రాష్ట్ర హోంమంత్రి జార్జ్ నివాసంలో రాష్ట్ర పోలీసు అధికారులు సమావేశమయ్యారు. ఆ సమయంలో రవీంద్రనాథ్ విషయంపై చర్చించారు. ఆయన గత చరిత్రను ఆరా తీశారని సమాచారం. ఇదిలా ఉంటే బెంగళూరు నగర పోలీస్ కమిషర్ రాఘవేంద్ర ఔరాద్కర్ బదిలీ చేయాలని పలువురు అధికారులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
పిలిచినా పలకలేదు :
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీజీపీ రవీంద్రనాథ్ గురువారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఔరాద్కర్‌తో మాట్లాడటానికి ప్రయత్నించడంతో ఆయన రవీంద్రను పట్టించుకోకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. రవీంద్ర ఔరాద్కర్ చెయ్యి పట్టుకుని చెప్పడానికి వచ్చిన ఆయన చెయ్యి విడిపించుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఆయనపై ఒక్క ఆరోపణ కూడా లేదు : శ్రీదేవి
తన భర్త ఏడీజీపీ రవీంద్రపై ఇంతవరకు ఒక్క ఆరోపణ కూడా లేదని ఆయన భార్య శ్రీదేవి అన్నారు. గురువారం ఆమె కుమార్తె కుశాలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
సర్వీసులో ఎటువంటి మచ్చ లేని తన భర్త పట్ల ఉన్నతాధికారుల తీరును ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక పోలీస్ అధికారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవి కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్తె కూడా మాట్లాడారు. తన తండ్రి గురించి తన స్నేహితులను అడిగి తెలుసుకోవాలని కుశాల సూచించారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే తన తండ్రిపై కక్షతో కేసులు బనాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడీజీపీ రవీంద్రనాథ బదిలీ :
బుధవారం అర్ధరాత్రి ఐదు గంటల పాటు కేఎస్‌ఆర్‌పీ సిబ్బంది ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆ విభాగపు ఏడీజీపీగా ఉన్న రవీంద్రనాథ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కేఎస్‌ఆర్‌పీ బాధ్యతలను ఏడీజీపీ ఎన్.ఎస్. మోఘారిక్‌కు అప్పగించారు. గురువారం కేఎస్‌ఆర్‌సీపీ సిబ్బంది బయటకు రాకుండ అదే ఆవరణలో విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
కమిషనర్, డీసీపీలపై కేసు :
బెంగళూరు నగర పోలీస కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, డీసీపీ రవికాంత్‌గౌడ, హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవి కుమార్‌పై ఏడీజీపీ రవీంద్రనాథ్ ఇక్కడి కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను వేధించి అనవసరంగా కేసు నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను తప్పు చేసిన ఉంటే అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఒక్క ఐపీఎస్ అధికారికే న్యాయం జరగనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఔరాద్కర్, రవికాంతేగౌడ్ తదితరులు కావాలని తనపై కక్ష సాధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు అనంతరం తనకు చలాన్ ఇవ్వాలని పోలీసులను రవీంద్ర విజ్ఞప్తి చేశారు.