- కుమార బంగారప్ప స్పష్టీకరణ
- 26న నామినేషన్
- కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
- మరోసారి వీధికెక్కిన బంగారప్ప కుటుంబ కలహాలు
శివమొగ్గ, న్యూస్‌లైన్ : శివమొగ్గ నుంచి పోటీ చేయడానికి తనకు పార్టీ టికెట్టు ఇవ్వాలని రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప పెద్ద కుమారుడు కుమార బంగారప్ప కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. లేనట్లయితే పార్టీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్ తనకు లభిస్తుందనుకున్న తరుణంలో చేజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తాను ఎవరినీ నిందించదలచుకోలేదని చెప్పారు.
శుక్రవారం రాత్రి ఏఐసీసీ నాయకులు తనకు ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా కోరారని వెల్లడించారు. శనివారం రాత్రి బయలుదేరి వెళతానని, దీనికి ముందు తన మద్దతుదారులతో సమావేశమయ్యానని వివరించారు. పోటీ చేసి తీరాల్సిందేనని అందరూ పట్టుబట్టారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం లభించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 26న మధ్యాహ్నం 1.55 నుంచి 2.15 గంటల మధ్య నామినేషన్‌ను దాఖలు చేస్తానని ప్రకటించారు. మంజునాథ్ భండారీ ఇదివరకే బీ ఫారం దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, సీ ఫారం దాఖలు చేయడం ద్వారా ఆయనను పోటీ నుంచి తప్పించవచ్చని వివరించారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని చెప్పారు.
మళ్లీ కుటుంబ కలహాలు..
మాజీ సీఎం ఎస్. బంగారప్ప కుటుంబ కలహాలు మరో సారి వీధికెక్కాయి. కుమారుడు కుమార బంగారప్ప శివమొగ్గ నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు శనివారం ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మంజునాథ్ భండారీ నామినేషన్‌ను దాఖలు చేశారు. బీ ఫారాన్ని కూడా సమర్పించారు. జేడీఎస్ అభ్యర్థిగా కుమార సోదరి గీతా శివ రాజ్‌కుమార్ పోటీ చేయనున్నారు. మరో సోదరుడు, సొరబ ఎమ్మెల్యే మధు బంగారప్ప ఆమెను పోటీ చేయించేలా ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు.
గీతా ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ సతీమణి. బంగారప్ప జీవించి ఉన్నప్పుడే కుమార, మధుల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. అప్పట్లోనే కుమార ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో తమ నియోజక వర్గం నుంచి సోదరి పోటీ చేయడంపై కుమార అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మధు, కుమారల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కుమార శనివారం ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మధు, గీతాలతో పాటు శివ రాజ్‌కుమార్‌పై కూడా విరుచుకు పడ్డారు.
వాగ్బాణాలు
బావ శివ రాజ్‌కుమార్, సోదరుడు బంగారప్ప, సోదరి గీతాలపై ఈ సందర్భంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘శివు (శివ రాజ్‌కుమార్) మూడో కన్ను తెరిస్తే అంతా మారిపోతుంది’ అని మధు వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ అతనేమీ శివుడు కాదు, శివమొగ్గలో ఏమీ చేయలేరు అని సమాధానమిచ్చారు. అలాంటి భ్రమలు పెట్టుకోవద్దని సూచించారు.
శివు ద్వంద్వ రాజకీయాలకు పాల్పడడం తగదని హితవు పలికారు. అతనిలా చేయడం ఇదే తొలి సారి కాదన్నారు. గతంలో కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల తరఫున ప్రచారం చేశారని తెలిపారు. శివ రాజ్‌కుమార్ తన బావ కనుక ఏక వచనంతో సంబోధించానని సమర్థించుకున్నారు. ఆయన అభిమానులు నిరసన ప్రదర్శనలు నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ, దివంగత రాజ్‌కుమార్ ఆదర్శాలను పాటించడంలో తాను ముందుంటానని తెలిపారు.
ఆయన కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయబోనని అన్నారు. మధు శివమొగ్గలోని శరావతి దంత వైద్య కళాశాల భూములను దుర్వినియోగం చేశారని, ఈడిగ సామాజిక వర్గానికి చెందిన ఆ భూములను విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.